సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్ ఫార్మా కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున విష వాయువు లీకైన సంగతి తెలిసిందే. కాగా గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ గాజవాక ఆర్ కె ఆసుపత్రికి చేరుకొని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.(విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్)
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటనపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే నష్టపరిహారంగా 12 లక్షలు ఇచ్చి చేతలు దులుపుకోలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మా వైఎస్సార్‌సీపీ తరపున డిమాండ్ చేస్తే పట్టించుకోకుండా ఇపుడు కోటి రూపాయిలు డిమాండ్ చేసే అర్హత వారికి ఎక్కడిదన్నారు. మీరు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి బాధితులకి నష్టపరిహారం ఎంత ఇప్పించారో గుర్తు లేదా అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీరును ప్రశ్నించారు. పెద్ద మనిషినని చెప్పుకునే మీకు మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు.ఇప్పటికైనా టీడీపీ నేతలు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రభుత్వం కూడా స్పందించినట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటన తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారన్నారు.(విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం ఆరా)
ముఖ్యమంత్రి ఆదేశాలతో ఫ్యాక్టరీని ప్రస్తుతం షట్ డౌన్ చేస్తున్నామని, ఈ ప్రమాదంపై కలెక్టర్ విచారణకి ఆదేశించారన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాది యాజమాన్యాలకి కొమ్ముకాసే ప్రభుత్వం కాదని...ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనిపిస్తున్నట్లు ఎమ్మెల్యే అదీప్ రాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment