ఎంత గగనం!
Published Mon, Feb 3 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘నేను మీ వాడినే.. మీ సమస్యలన్నింటినీ నా సమస్యలే అనుకుంటా.. నా శక్తియుక్తులన్నీ వాటి పరిష్కారానికే ధారపోస్తా’.. ప్రతి ఎన్నికలకు ముందూ ప్రజల సమక్షానికే వెళ్లి రాజకీయ నాయకులు పలికే చిలక పలుకులివి. ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓట్లతో చట్టసభల్లో ప్రతినిధులుగా ఎన్నికైన వారికి, మంత్రి పదవులు దక్కిన వారికి ఆనక ప్రజలను, ప్రజల సమస్యలను పట్టించుకునేందుకు.. ఏళ్లు గడిచినా తీరికే చిక్కదు. తమ కుర్చీ ప్రజలు మెచ్చి ఇచ్చిందేనని, వారి రుణం తీర్చుకోవడమంటే వారిచ్చిన అధికారాన్నీ, పదవినీ వారి సమస్యల పరిష్కారానికి వెచ్చించడమేనని గుర్తు చేసినా గుర్తు రానంత మతిమరపురాయుళ్లయి పోతారు. అయితే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని గుర్తుకు వచ్చేసరికి మాత్రం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలంటూ సుడిగాలి పర్యటనలు చేసేస్తారు. అరకు ఎంపీ, కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అచ్చుగుద్దినట్టు ఆ బాపతు నాయకుడేనని తూర్పు మన్యంలోని గిరిజనులు ఎత్తిచూపుతున్నారు.
ఎప్పుడో రెండేళ్ల క్రితం ఒక్కసారి తళుక్కున మెరిసిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ఆదివారం మన్యంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హల్‌చల్ చేయడం గిరిజనులను విస్తుపోయేలా చేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల తరువాత తమ ప్రాంతానికి (అరకు పార్లమెంటు పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం) ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను రెండోసారి మాత్రమే చూడాల్సి రావడం తమ ప్రారబ్దమని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణానైన్నా విడుదలవుతుందనే సంకేతాలే కేంద్రమంత్రికి గిరిజనులు తిరిగి గుర్తుకు వచ్చేలా చేసినట్టు కనిపిస్తోందని గిరిజన సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2009 ఎన్నికల తరువాత 2011 సెప్టెంబరు 24న రంపచోడవరం, అడ్డతీగల, గంగవరం మండలాల్లో ప్రారంభోత్సవాలు చే సిన కిశోర్‌చంద్రదేవ్ తర్వాత ఈ ప్రాంతాన్ని తొంగి చూడలేదంటున్నారు. ఆయనను మళ్లీ చూసేలోగా రెండు క్యాలెండర్లు మారాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పర్యటన ఎన్నికల గిమ్మిక్కే..
కాగా మంత్రి ఇప్పుడు కూడా గతంలో మాదిరే రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల మండలాల్లో సుమారు రూ.23.40 కోట్లతో 30 పనులకు ఒకే రోజులో శ్రీకారం చుట్టేశారు. పీఎంజీఎస్‌వై పథకంలో గంగవరం మండలం పాతరామవరం-భజనపల్లి రహదారి నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నా ప్రారంభోత్సవం చేశారు. పీఆర్ నిధులతో గంగవరం-లక్కొండ మధ్య రోడ్డు నిర్మాణం కూడా ఇంకా పూర్తికాలేదు. ఇంకా 40 శాతం పనులు పూర్తికావాల్సి ఉంది. అయినా హడావిడిగా ప్రారంభోత్సవం చేసేశారు. అలాగే మారేడుమిల్లిలోని కస్తూరిబా గాంధీ పాఠశాల నిర్మాణం ఎన్నడో పూర్తి అయిపోయింది. బడి మధ్యలోనే మానేసిన పిల్లలను గత డిసెంబరు నెలలోనే ఆ పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.
అటువంటి పాఠశాలను మంత్రి కొత్తగా ప్రారంభించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు కాక మరేమిటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల తరువాత వచ్చిన కేంద్రమంత్రి మరోసారి మన్యంకు వచ్చే అవకాశం ఉంటుందో, లేదో అనే ముందుచూపుతోనే ఇవన్నీ చేసినట్టు ఉందంటున్నారు. రెండేళ్ల క్రితం మంత్రి మన్యం పర్యటనకు వచ్చినప్పుడు రంపచోడవరం సమీపంలో పెదగెద్దాడ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఆ వంతెన పనులు ప్రారంభం కానేకాలేదు. పాత వాటికి దిక్కూమొక్కూలేదు, కొత్తవాటికి శ్రీకారం చుట్టినా అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయన్న ఆదుర్దాతో ముందస్తుగా వచ్చినందుకు సంతోషించాలో, పూర్తవని పనులు హడావిడిగా ప్రారంభించడం ద్వారా తమను మరోసారి వెక్కిరిస్తున్నారని విచారించాలో తెలియడం లేదని గిరిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement