రాజమౌళి ప్రాయం 4..బరువు 3
సారధి (రాజాం): ఈ ఫొటోలో కనిపిస్తున్న బాబు పేరు రాజమౌళి. తుళ్లింతలు, కేరింతలతో గడవాల్సిన ఈ బాలుడి బాల్యాన్ని విధి చిదిమేసింది. గాజుబొమ్మలా మిగిల్చింది. రాజాం నగర పంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన మజ్జి గణేష్, నాగమణి దంపతుల కుమారుడైన రాజమౌళి పుట్టి నాలుగేళ్లయినా మూడు కిలోలకు మించి బరువు పెరగలేదు. పుట్టినప్పుడు బాగానే ఉన్నా కొద్దికాలానికే అతనిలో ఎదుగుదల నిలిచిపోయింది. బొమ్మలా తయారయ్యాడు.
శరీరం ఇష్టమొచ్చిన రీతిలో ఒంగిపోతుంటుంది. ఆకలి. నిద్ర అన్నవే తెలియవు. అసలు ఈ లోకంతోనే సంబంధం లేనట్లు దిక్కులు చూస్తుంటాడు. నోరు తెరిచినప్పుడు మాత్రమే ఆహారం అందివ్వాలి. 24 గంటలూ ఎవరో ఒకరు సంరక్షిస్తూ ఉండాల్సిందే. తాపీమేస్త్రీ పని చేసుకునే గణేష్ తన తాహ తుకు మించి ఎన్నో చోట్ల.. ఎంతో మంది వైద్యులకు కొడుకును చూపించి, ఆరోగ్యవంతుడిని చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
ప్రస్తుతం గణేష్ దంపతులకు ఏడాది వయసున్న కుమార్తె పూజిత కూడా ఉంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. కొడుకు పరిస్థితే వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. అచేతన స్థితిలో ఉన్న రాజ మౌళిని గణేష్ తల్లిదండ్రులు రాము, భాగ్యం ప్రస్తుతం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పుట్టిన వెంటనే చిన్న సమస్యే అనుకున్నామని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేకపోయామంటూ వారంతా కన్నీటిపర్యంతమవుతున్నారు.
అంతుచిక్కని లోపం
ఇంగ్లీష్, ఆయుర్వేదం, హోమియోపతి.. ఇలా అన్ని రకాల వైద్యాలు చేయించినా రాజమౌళి పరిస్థితి ఏ డాక్టర్‌కూ అంతు చిక్కలేదు. తొలుత 2010లో విజయవాడలోని ఓ కార్పొరే ట్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యనిపుణులు అన్ని రకాల పరీక్షలు జరిపాబాలుడి మెదడు అభివృద్ధి చెందడం లేదని, తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. కనీసం పరీక్షల నివేదికలు కూడా వీరికి ఇవ్వలేదు.దీంతో ఏడాది క్రితం రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రిలో చూపిస్తే హైదరాబాద్‌లో అత్యాధునికమైన చికిత్స అందే అవకాశముందని, అది చాలా ఖరీదైన ప్రక్రియ అని చెప్పారు.
శస్త్రచికిత్స చేస్తే రూ.15 లక్షలు ఖర్చవుతుందని, అయినా సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు చాలా స్వల్పమని తేల్చి చెప్పారు. బతికున్నంత కాలం బాబును కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. దీంతో ఏం చేయాలో తోచక ఆ పేద తల్లిదండ్రులు దిక్కులు చూస్తున్నారు. తమ కుమారుడు సాధారణ స్థితికి వచ్చి, తమను అమ్మానాన్నలుగా గుర్తించి అందరు పిల్లల మాదిరిగా తమ కళ్లెదుట తిరుగాడాలన్న ఆకాంక్ష నెరవేర్చే దయార్ధ్ర హృదయుల కోసం ఎదురు చూస్తున్నారు. మానవతావాదులు ముందుకురావాలని, చేయూతనివ్వాలని గణేష్, నాగమణి(ఫోన్ నెం: 9010765420) వేడుకుంటున్నారు.