లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
నేను గృహిణిని. వ్యాయామాలు చేయడానికి టైమ్ ఉండదు. ఈమధ్య బాగా బరువు పెరుగుతున్నాను. వ్యాయామం చేయకుండానే బరువును అదుపులో ఉంచుకునేందుకు జాగ్రత్తలు చెప్పండి. - కృష్ణవేణి, చోడవరం
చాలామంది గృహిణులు మీరు చెబుతున్న సమస్యలనే ప్రస్తావిస్తుంటారు. ఇంటిపనుల్లో బిజీగా ఉండి, వేళకు తినకపోవడం, పైగా అన్నం వృథా కాకూడదంటూ మిగిలిపోయినవి తినడం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. మీరు బరువు పెరగకుండా అదుపు చేసుకునేందుకు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి.
కొద్దిగా తినే షాపింగ్‌కు వెళ్లకండి... ఏదైనా కొనాల్సిన సమయంలో వచ్చాక తినవచ్చు అనే ఫీలింగ్‌తో ఖాళీ కడుపుతోనే షాపింగ్‌కు చాలా మంది గృహిణులు చేస్తుంటారు. మీరు అలా తినకుండా షాపింగ్‌కు వెళ్లకండి. అలాంటప్పుడు ఆకలి పెరిగి, అధిక క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. పైగా బయటి తిండి ఆరోగ్యంగా ఉండదు. షాపింగ్ చేసే సమయంలో వేగంగా నడవడం వల్ల మీరు చురుగ్గా ఉండటంతో పాటు జీవక్రియల వేగం పెరిగి మీకు అనుకోకుండానే వ్యాయామం చేకూరుతుంది.
ఎక్కువసార్లు తినండి: తక్కువ మోతాదులో ప్రతి మూడు గంటలోకొకసారి తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశం తక్కువ. బాగా ఆకలిగా ఉన్నప్పుడు మోతాదుకు మించి ఆహారం తీసుకుంటుంటారు. అందుకే ఎప్పుడూ తీవ్రంగా ఆకలయ్యే వరకు ఆగవద్దు. ఉదయం వేళ టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్)ను ఎప్పుడూ మిస్ చేయకండి.
మెల్లగా తినండి: ఆహారాన్ని మెల్లగా ఆస్వాదిస్తూ తినండి. ఆహారం తీసుకునేందుకు కొద్దిసేపటి ముందుగా ఒక కప్పు సలాడ్స్‌తో పాటు నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిపోయి తక్కువగా తింటారు.
పగటి నిద్ర వద్దు: మధ్యానం పూట అస్సలు నిద్రపోవద్దు. ఇది కూడా తిన్న తర్వాత అస్సలే నిద్రపోవద్దు. అయితే రాత్రివేళ కంటికి నిండుగా కనీసం 7-8 గంటలు నిద్రపోండి.
అవకాశం ఉన్నప్పుడల్లా నడవండి: ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడల్లా అటూఇటూ నడుస్తూ మాట్లాడండి. కానీ అదే సమయంలో నిర్లక్ష్యంగా చూసుకోకుండా, మెట్లపైకి వెళ్లడం చేయకండి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్
మా అమ్మగారికి వయసు 40 ఏళ్లు. ఈమధ్య కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్ అని తెలిసింది. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి. - రాధారమణి, శ్రీకాళహస్తి
రక్తకణాల ఉత్పత్తి ప్రభావితం కావడం వల్ల బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యార్ (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడి మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్‌లెట్స్‌గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. అనియంత్రితంగా ఇలా రక్తకణాలు పెరిగిపోవడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. నియంత్రణ లేకుండా పెరిగిన ఈ కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా పేషెంట్స్ రోగనిరోధక శక్తి కోల్పోతారు. లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పిత్తి అవుతుంటాయి. వీటి వల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన కూడా ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు రావడం కనిపిస్తుంది. వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో అవి తమ విధులను సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరకణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బుల్లోనూ ఆ లక్షణాలు ఉండవచ్చు. అందుకే ఆ లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాలి.
డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్
బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్