
విద్యుత్ చార్జీలపై యుద్ధం
విజయవాడ : విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పది వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. మంగళవారం విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయా పార్టీల సమావేశం జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకుడు పి.సుందరరామరాజు అధ్యక్షత వహించారు. విద్యుత్ పంపిణీలో నష్టాలను అరికట్టడం, ప్రైవేటు విద్యుత్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడం, ప్రభుత్వ సబ్సిడీ పెంచడం తదితర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపైనే భారం వేసేందుకు సిద్ధమవడాన్ని వామపక్షాలు ఖండించాయి. చార్జీల పెంపును అడ్డుకునేందుకు కార్యాచరణను ప్రకటించాయి. వివిధ ప్రాంతాల్లో ఈఆర్‌సీ నిర్వహించే బహిరంగ విచారణల్లో పాల్గొని చార్జీలు పెంచడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయాలని, ధర్నాలు నిర్వహించాలని సమావేశం కార్యకర్తలకు పిలుపునిచ్చింది. చార్జీలు పెంచితే ప్రజలపై రూ.1,261 కోట్ల మేరకు భారం పడుతుందని నేతలు పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఇలావుండగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు తదితర ప్రాంతాల్లో, ప్రభుత్వ పోరంబోకు ప్రదేశాల్లో నివాసం ఉంటున్న పేదల ఇళ్లస్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలుచేయాలని కేంద్రాన్ని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకులు ఆర్.రమ, పోలారి, సీపీఐ ఎంఎల్ నాయకులు కోటయ్య, సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శిశు సంక్షేమ శాఖకు రూ.1100 కోట్లివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ శిశు సంక్షేమశాఖకు రూ.1,100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మేనకాగాంధీని రాష్ట్ర మంత్రి పీతల సుజాత కోరారు. ఢిల్లీ శాస్త్రి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం కేంద్రమంత్రితో పీతల భేటీ అయ్యారు. అనంతరం ఏపీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి నీలం సహానీతో కలసి ఆమె మాట్లాడారు. ‘మహిళా, శిశు సంక్షే మ శాఖ నుంచి ఈ బడ్జెట్‌లో రూ. 1,100 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చాం. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని చెప్పారు.