తెలంగాణలో నిరసనల హోరు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ, ఓయూలో పోలీసుల తీరు, నిజాం కాలేజీలో విద్యార్థుల అరెస్టు వంటి సంఘటనలు నిరసిస్తూ ఆదివారం తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తాయి. నిజామాబాద్ జిల్లాలో ఇందూరు బ్రాహ్మణ సేవా సంఘం తెలంగాణ సాధన యజ్ఞం నిర్వహించింది. పీడీఎస్‌యూ జిల్లా కమిటీ రాస్తారోకో చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో టీఆర్‌ఎస్వీ, శ్రీరాంపూర్‌లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. కాగజ్‌నగర్, రెబ్బెనలో జేఏసీలు సమైక్యవాదుల, సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో బీడీఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, తెలంగాణ విద్యావంతుల వేదికలు రాస్తారోకో చేసి.. సీఎం, డీజీపీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట, వనపర్తి, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గ కేంద్రాల్లో సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సీఎం, డీజీపీల దిష్టిబొమ్మలకు నిప్పంటించారు. ఏపీ ఎన్జీవోల సభలో కానిస్టేబుల్‌పై దాడికి నిరసనగా మెదక్ జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో టీఆర్‌ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో, విద్యారణ్యపురిలో తెలంగాణవాదులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు శనివారం హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించారని ఆరోపిస్తూ గజల్ శ్రీనివాస్‌పై పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట, కరీంనగర్ జిల్లా వేములవాడ, రంగారెడ్డి జిల్లా వికారాబాద్, వరంగల్ జిల్లా కేంద్రంలోని ఠాణాల్లో ఫిర్యాదు చేశారు.