బిడ్డల చదువు కోసమో... ఆడబిడ్డ పెళ్లి ఖర్చుకోసమో... అత్యవసర సమయంలో ఆసుపత్రి ఖర్చు కోసమో... అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసిన సిక్కోలు ప్రజలకు మూడేళ్లుగా చిక్కులు మొదలయ్యాయి! గుంటూరులో హాయ్‌ల్యాండ్, వైజాగ్‌లో వేల ఎకరాల భూములు, టేకు తోటలు అంటూ సంస్థ భరోసా ఇవ్వడంతో తాము కష్టపడి సంపాదించినదంతా పెట్టుబడి పెట్టారు! కొంతమంది అప్పులు చేసిమరీ నెలవారీ వాయిదాలు కట్టారు! రెండు దశాబ్దాల పాటు నమ్మకంగా సాగిన వ్యవహారం కాస్త మూడేళ్ల క్రితం నుంచి తిరగబడింది! కొన్ని దుష్టశక్తులు, కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థచింతనతో సంస్థ ఆస్తులపై కన్నేయడమే బాధితుల పాలిట శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమకు లాభం వద్దు... తాము పొదుపు చేసిన సొమ్ము అణాపైసలతోనైనా చెల్లించాలని బాధితులు నిరసనలతో రోడ్డెక్కినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధితులకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం కూడా కొరడా ఝుళిపించింది. కానీ బాండ్ల పరిశీలన పేరుతో ప్రభుత్వం ప్రక్రియను సాగదీసే కార్యక్రమం చేపట్టిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం:
జిల్లాలో 1,43,643 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని అధికారుల అంచనా. కానీ శుక్రవారానికి కేవలం 33,500 మంది మాత్రమే ఈ పరిశీలన ప్రక్రియ పూర్తి చేయించుకోగలిగారు. తొలుత ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు సీఐడీ అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పుడు మండలాల్లో పోలీసుస్టేషన్లవారీగా పరిశీలన కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పుడు వాటి చుట్టూ జిల్లాలోని ప్రజలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది చివరి నెల వాయిదా చెల్లింపు రసీదులు లేకపోవడం, బ్యాంకు ఖాతా నంబరుతో పాటు పాలసీదారుడు కూడా తప్పనిసరిగా హాజరుకావాలనే నిబంధనలు పెట్ట డంతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గంటల తరబడి వరుసలో నిలుచున్నా సర్వర్లు తరచుగా మొరాయిస్తుండటంతో పనిపూర్తి కావట్లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో తమ పాలసీలను నమోదు చేయించుకునేందుకు మూడు నాలుగు రోజుల పనిమానుకొని ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని బా ధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ బాండ్ల వివరాలన్నీ అగ్రిగోల్డ్ సంస్థ వద్ద ఉన్నప్పుడు మళ్లీ ఈ పరిశీలన కార్యక్రమం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పాలకులు ఏదోలా కాలం గడిపేయడానికే తప్ప తమకు మేలు జరిగే అవకాశం కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు సమాచారం ఇచ్చినా... ప్చ్!
ప్రతి మండలంలోనూ పోలీసుస్టేషన్ల పరధిలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన, డిపాజిట్‌దారుల వివరాల నమోదు ప్రక్రియను సీఐడీ అధికారులు చేపట్టారు. ఏయే తేదీల్లో ఏయే గ్రామాల నుంచి అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు రావాలో ముందుగా ప్రకటించారు. జిల్లాలో డిపాజిట్‌దారులు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారే. వారిలో నిరక్షరాస్యులు ఎక్కువమంది ఉండటం, తాము ఎప్పుడు హాజరుకావాలనేదీ సమాచారం లేక స్పష్టత కొరవడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలాల వారీగా తహసిల్దారు కార్యాలయాల వద్ద, పోలీసుస్టేషన్ల వద్ద అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల జాబితా అతికించామని అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడ ఆ వివరాలు అర్థం కాకపోతే బాధితులకు వివరించేవారే కరువయ్యారు. తీరా ఎలాగో తెలుసుకొని వచ్చినా ముందు రోజుల్లో ప్రకటించిన గ్రామాల వారి బాండ్ల పరిశీలనే పూర్తికావట్లేదు. సాంకేతిక సమస్యలతో బాధితులు బారులు తీరుతున్నారు. పోలీసుస్టేషన్ల ఆవరణలోనే చెట్ల కింద, షెడ్లలో నీరసంతో కూలబడిపోతున్నారు. చాలాచోట్ల వారిక మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేవు.
నిబంధనలతో ఇక్కట్లు
బాండ్ల పరిశీలనకు కూడా పలు నిబంధనలు విధించడంతో బాధితులకు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ చుక్కలను చూపిస్తోంది. డిపాజిట్‌దారుడి ఆధార్‌కార్డులో చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే పరిశీలన చేయించుకోవాలని కొన్ని సెంటర్లలో తిప్పి పంపించేస్తున్నారు. మరికొన్నిచోట్ల అగ్రిగోల్డ్‌కు చెందిన ఏ బ్రాంచిలోనైతే సొమ్ము డిపాజిట్ చేశారో దాని పరిధిలో ఉన్న మండలంలోనే పరిశీలన చేయించుకోవాలని చెప్పడంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. తాము ఏజెంట్లకు సొమ్ములు ఇచ్చామే తప్ప బ్రాంచి ఎక్కడో తమకు తెలియదని వాపోతున్నారు. వలసలకు పేరొందిన ఈ జిల్లాలో వెరిఫికేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడానికి ఈ నిబంధనలేనన్న విమర్శలు వస్తున్నాయి. తమ ఆధార్‌కార్డుపై ఉన్న చిరునామాకు, తమ సొమ్ము సొమ్ము డిపాజిట్ చేసిన బ్రాంచి చిరునామాకు పొంతన లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. దీనికితోడు బాండ్ల పరిశీలనకు డిపాజిట్‌దారుడే స్వయంగా హాజరుకావాలన్న నిబంధన కూడా ఇబ్బందిగా మారింది. దీంతో పదేపదే తిరగాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు.
రసీదులు లేనివారికి కష్టాలే
బాండ్‌తో పాటు వాయిదా చెల్లింపు చివరి నెల రసీదు కూడా పోలీసులు అడుగుతుండటంతో బాధితులు సమర్పించలేకపోతున్నారు. వారిలో చాలామంది రూ.20 నుంచి రూ.50, రూ.100 వరకూ నెలవారీ వాయిదాలు చెల్లించినవారే ఎక్కువ మంది ఉన్నారు. అదీ చెల్లింపులు జరిగి ఏళ్ల కాలం గడిచిపోవడంతో ఇప్పుడవి తెమ్మంటే ఎలాగని పోలీసుల వద్ద ప్రాథేయపడుతున్నారు. దీనికితోడు ఆ రసీదులు పోగొట్టుకున్నవారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కొంతమంది వద్ద బాండ్లు కూడా ఉండట్లేదు. మరికొంతమంది వాయిదాలు ముగియడంతో బాండ్లను ఏజెంట్లకు అప్పగించేశారు. అవన్నీ అగ్రిగోల్డ్ బ్రాంచిల్లో ఉన్నాయి. వారంతా అసలు బాండ్లను పరిశీలనకు ఇవ్వలేని పరిస్థితి. ఆయా బాండ్ల కోసం ఏజెంట్లను కొంతమంది నిలదీస్తున్నా వారుకూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో తమ వివరాలు ఎలా నమోదు చేయించుకోవాలనీ తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు తాము కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బు తమకివ్వడానికి ఇన్ని ఆంక్షలు అవసరమా అని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment