
ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లైఓవర్
సాక్షి, విజయవాడ బ్యూరో : గన్నవరం విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో ఆయన రాజధాని వ్యవహారాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విమానాశ్రయ అప్రోచ్ రోడ్డును హైవే వరకు నాలుగు లైన్లుగా విస్తరించి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. హైవే, విమానాశ్రయం ట్రాఫిక్‌కు సంబంధం లేకుండా ఉండేలా దీన్ని నిర్మించాలని చెప్పారు.
భారీ విమానాలు ఆగేందుకు వీలుగా రన్‌వే విస్తరణ కోసం ఏలూరు కాలువను ఏడు కిలోమీటర్లు మళ్లించే పనులను 40 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెండు ఆర్ అండ్ బీ రోడ్లను మూడు కిలోమీటర్ల మేర మళ్లించే పనులను 45 రోజుల్లో చేయాలని సూచించారు. విశాఖపట్నం - విజయవాడ, చెన్నై - నెల్లూరు, విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారులను ఆరు వరుసలుగా విస్తరించాలని చెప్పారు. ఇందుకోసం వెంటనే సవివర నివేదికలు తయారు చేయాలని సీఎం హైవే అధికారులకు సూచించారు.
పండుగలా రాజధాని శంకుస్థాపన...
అక్టోబర్ 22వ తేదీన రాజధాని శంకుస్థాపనను పండుగలా చేయాలని, ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య మంత్రి ఈ కార్యక్రమానికి వస్తున్నారని సీఎంతెలిపారు. శంకుస్థాపన పైలాన్ భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఉండాలని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఒక పార్కుగా తయారుచేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 29 రాజధాని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని, దానిలో గ్రామస్తులకు ఉపాధికి దొరుకుతుందని తెలిపారు.
గ్రామకంఠాలకు ఆనుకుని ఉన్న 8వేల ఎకరాలను భూసమీకరణ కింద ఇస్తామని పెదపరిమి, హరిశ్చంద్రపురం, వడ్డమాను గ్రామాల రైతులు ముందుకు వచ్చారని, దీన్ని పరిశీలించాలని సీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కార్యాలయాల తరలింపును వేగవంతం చేయాలని, అధికారులకు అవసరమైన నివాస సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.