పీసెట్ ప్రవేశ పరీక్షలకు ఏఎన్‌యూ క్రీడా మైదానంలో చేసిన ఏర్పాట్లు
ఏఎన్‌యూ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిజికల్‌ఎడ్యుకేషన్ కళాశాలల్లో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నుంచి నిర్వహిస్తున్న ఏపీపీసెట్–2018కు ఏఎన్‌యూలో అన్ని ఏర్పాట్లు చేశామని పీసెట్ కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతిరోజు నిపుణులైన 40 మంది టెస్టర్లు ప్రవేశ పరీక్షలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌కు, వేచి ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రవేశ పరీక్షలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యర్థులు హాజరవుతున్నందున వారిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెండు ట్యాంకర్లతో తాగునీరు, యూనివర్సిటీ క్యాంటీన్‌లో భోజనం, క్రీడా వసతి గృహంలో వసతి ఏర్పాట్లు చేశామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దేహ దారుఢ్య పరీక్షలను సింథటిక్ ట్రాక్‌లో నిర్వహిస్తున్నామన్నారు. గురువారం పురుషుల విభాగంలో 10001 నుంచి 10489 హాల్‌టికెట్ నంబరు వరకు గల అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రవేశ పరీక్షల్లో భాగంగా దేహదారుఢ్య పరీక్షలో 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్/హైజంప్, షాట్‌పుట్, పురుషులకు 800 మీటర్ల పరుగు, మహిళలకు 400 మీటర్ల పరుగు అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. క్రీడా నైపుణ్య పరీక్షలో భాగంగా అభ్యర్థి ఎంచుకున్న ఏదో ఒక క్రీడలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఏఎన్‌యూలో ఉన్న క్రీడా వసతులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పీసెట్ నిర్వహణను 2007 నుంచి వరుసగా ఇప్పటివరకు ఏఎన్‌యూకి అప్పగించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment