గుంటూరులో సిద్ధమైన వేదిక, (ఇన్‌సెట్‌లో) ఏర్పాట్లను పరిశీలిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు బొత్స, రావి, లేళ్ల, మేరుగ, జంగా, కాసు, ఇతర నాయకులు
హోదా పదేళ్లు ఇస్తామని మోదీ, కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రగల్భాలు పలికారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామంటూ నమ్మబలికి ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. అప్పటి నుంచి హోదాను పక్కకు నెట్టారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఊరూరా గళం విప్పారు.
ఈ ఉద్యమాన్ని పాలకులు అధికారంతో అణగదొక్కే ప్రయత్నం చేశారు. చివరకు కమీషన్ల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి తలూపి హోదాను తాకట్టు పెట్టారు. ప్రజలు భగ్గుమనడంతో చంద్రబాబు మళ్లీ హోదా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మరోసారి రాష్ట్రాన్ని వంచించేందుకు నడుం బిగించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్ సీపీ నేతలు దీక్ష బూనారు. టీడీపీ దురాగతాలను ఎండగట్టనున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : వంచనపై గర్జన దీక్షకు సర్వం సిద్ధమైంది. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువభేరిలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే దీక్షలు, వంటా వార్పులు ఇలా అనేక రకాల ఉద్యమాలతో పోరాటం సాగించారు. ఈ క్రమంలో గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో రాష్ట్ర స్థాయి దీక్ష చేపట్టారు. నగరంలోని ఇన్నర్‌రింగ్ రోడ్డులోని వీఏఆర్ గార్డెన్స్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.
బీజేపీ, టీడీపీ కుట్రను ఎండగట్టేందుకే..
ఇప్పటికే గుంటూరులోని వీఏఆర్ గార్డెన్స్‌లో దీక్ష స్థలిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులు నాలుగేళ్ళ క్రితం వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పక్కకు నెట్టేశారు. హోదా కాదు, ప్యాకేజీ అంటూ ప్లేటు ఫిరాయించారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. చివరకు పదవులకు రాజీనామా చేసి హోదా ఉద్యమాన్ని ఢిల్లీకి తాకించారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుని ప్రజలను మరోసారి వంచిస్తోంది. ఈ మోసాలను ప్రజలకు వివరించి.. హోదా గళం వినిపించేందుకు వంచనపై గర్జన పేరుతో సింహనాదం చేయనున్నారు. హోదాపై ప్రజలను చైతన్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.
దీక్ష ఏర్పాట్లను పరిశీలించిన నేతలు....
దీక్షా స్థలిలో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు, దాదాపు 250 మందికిపైగా కూర్చునేందుకు వీలుగా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఐదు వేల మందికిపైగా కార్యకర్తలకు సీటింగ్‌లు ఉండేలా చూస్తున్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి వసతి కల్పిస్తున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన వారిలో వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా పరిశీలకులు బొత్స సత్యనారాయణ, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, గురజాల, పెదకూరపాడు సమన్వకర్తలు కాసు మహేష్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బూరెల దుర్గ, ఎస్సీ విభాగం నాయకులు సాయిబాబా, ఆళ్ళ పూర్ణచంద్రరావు, మేరువ నర్సిరెడ్డి, పరస కృష్ణారావు, పసుపులేటి రమణ, మెట్టు వెంకటప్పారెడ్డి, బండారు సాయిబాబు, తనుబుద్ధి కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment