
సాక్షి, గుంటూరు : రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పార్థసారధి ఆరోపించారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు కేబినేట్‌లో ఒక్క ముస్లింకు కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. మొన్నటివరకూ హోదా వస్తే పారిశ్రామిక రాయతీలు రావన్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకొని హోదా కావాలంటున్నారని విమర్శించారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు రెండు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.
హోదా వద్దని ప్యాకేజీయే కావాలని చంద్రబాబు కోరడం వల్లే హోదా రాలేక పోయిందన్నారు. చంద్రబాబు నయవంచకుడని, ప్రజలు అతన్ని నమ్మే ప్రసక్తి లేదన్నారు. హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను చంద్రబాబు అవహేళన చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.