అసెంబ్లీలోనే కుట్రలా?
అమరావతి: అసెంబ్లీలోకి వర్షపు నీరు లీకేజీ వ్యవహారంపై సీఐడీ విచారణ కాదు, సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సచివాలయంలో లీకేజీపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయంలోకి మీడియాను ఎందుకు అనుమతించలేదని అడిగారు.
లీకేజీపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ కట్టుకథలేనని అన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసి విచారణ జరపమేంటని నిలదీశారు. తుని ఘటనలాగే దీన్ని కూడా పక్కదారి పట్టిస్తారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పకడ్బందీ భద్రత ఉండే అసెంబ్లీలోనే కుట్రలా, భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అన్ని వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ జరపాల్సిందేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.