సెంటీమీటరు వానకే.. ఇన్ని లీకులా!
ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10 వేలు ఖర్చుపెట్టి ప్రపంచ స్థాయిలో తాత్కాలిక రాజధాని భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారని, కానీ గట్టిగా ఒకటి, రెండు సెంటీమీటర్ల వానకే భవనాలన్నీ లీకుల మయం అయిపోయాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పలు భవనాలు లీకులమయం కావడంతో దాన్ని పరిశీలించేందుకు మీడియా ప్రతినిధులను తీసుకుని లోపలకు వెళ్లేందుకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.
అయితే అక్కడున్న పోలీసులు, ఇతర అధికారులు మాత్రం మీడియాను లోపలకు అనుమతించలేదు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే వెళ్లనిస్తామని, మీడియాను లోపలకు రానివ్వబోమని, ఆ మేరకు తమకు స్పష్టమైన ఉత్తర్వులున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తమకు చెప్పినట్లు ఆర్కే తెలిపారు. ఉన్న వాస్తవాలను బయటకు చెప్పడానికి మీడియాను తీసుకుని లోపలకు వెళ్దామంటే కనీసం అనుమతి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ లోపలకు కాకపోయినా కనీసం ప్రాంగణంలో మీడియా పాయింటు ఉంది కాబట్టి అక్కడి వరకు అనుమతించాలని కోరినా, దానికి కూడా అంగీకరించలేదన్నారు. దీనివెనక దురుద్దేశాన్ని గమనించాలని, వైఎస్ జగన్ చాంబరే కాదు, అసెంబ్లీ, సీఎం చాంబర్, మంత్రుల చాంబర్లు ఎలా ఉన్నాయో కూడా చూపించాలని ఆయన తెలిపారు. లోపల ఎవరో సిబ్బంది తీసిన చిన్న వీడియో క్లిప్ ద్వారానే ఈ భవనాల బండారం మొత్తం బయటపడిందని, అందువల్ల లోపల భవనాల నాణ్యత ఎలా ఉందో కచ్చితంగా చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
నూజివీడు ప్రాంతంలో రాజధాని కట్టాలని తాము ఎంతగానో కోరామని, ఇక్కడ అంతా నల్లమట్టి, ఇది నిర్మాణాలకు పనికిరాదని చెప్పామని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. తాము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా.. ఏదో త్వరగా చేసేశామని చూపించుకోవాలన్న తొందరలో ఇలా నాణ్యత లేని నిర్మాణాలు చేయించారని, అందుకే కట్టిన కొద్ది రోజులకే ఇలా నీళ్లు కారుతున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని ఆయన చెప్పారు. నూజివీడు దగ్గర ప్రభుత్వ భూములు 140 ఎకరాలున్నాయి. అయినా అక్కడ కాదని ఇక్కడే కట్టారన్నారు.
మీడియాను నియంత్రించడం సరికాదని, వర్షానికి తడిసి ముద్దయిన అసెంబ్లీ ఎలా ఉందో ప్రపంచానికి తెలియాలని మరికొందరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత చాంబరే ఇలా ఉంటే ఇక అసెంబ్లీ హాల్ ఎలా ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు. రూ. 900 కోట్లు ఖర్చుపెట్టి నాసిరకం పనులు చేపట్టారని, అసెంబ్లీ నిర్మించేటపుడు తొందరపాటు వద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెబుతున్నా తనకు అనుభవం ఉందంటూ చంద్రబాబు ఊదరగొట్టారని చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలియకూడదనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, చంద్రబాబు వల్ల ఏపీ పరువు పోయిందని, ప్రపంచ స్థాయి నిర్మాణం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.