నారాయణ, పుల్లారావుకు ఇవి కనిపించడం లేదా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములిచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని ప్రతిరోజు విదేశాల్లోను, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారని.. కానీ రైతుల కాళ్లు లాగుతూ, వారిని కింద పడేస్తున్నారన్నది సత్యమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆరోపించారు.
'ఉచిత విద్య, అందరికీ పెన్షన్లు ఇవ్వకపోగా చివరకు యువతకు తాత్కాలికంగా ఎన్యుమరేషన్ చేశామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మంది నిరుద్యోగులు ఉంటే, 26 వేల మందిని ఎంపిక చేశారు. తొలిదశలో 6వేల మందిని ఎంపికచేసి, అందులోనూ హీనంగా 113 మందికి మాత్రమే ఏఎన్‌యూ, చిలకలూరుపేట స్పిన్నింగ్ మిల్లులకు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు తీసుకెళ్లారు. బస్సు చార్జీలు ఇవ్వలేదు, కనీసం స్టైపండు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరని వాళ్లు సీఆర్‌డీఏ ఆఫీసు దగ్గర నిలదీస్తే కేసులు పెట్టి హింసిస్తున్నారు. ప్రభుత్వం చేసింది తప్పని సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాజీనామా కూడా చేశారు. ఇవన్నీ మంత్రులు నారాయణ, పుల్లారావులకు కనిపించడం లేదా? మీరు చెప్పిన వాగ్దానాలకు కట్టుబడి ఉండండి. చదువుకున్న యువతీ యువకులను మోసం చేయడమే కాదు, చివరకు సిమెంటు బొచ్చెలు మోసే పని కూడా స్థానికులకు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఉద్యోగాలు ఇవ్వకపోతే యువతీ యువకులు భారీ ఎత్తున ఉద్యమం చేస్తారు' అని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.