
స్పీకర్ కుర్చీని కూడా వాడుకుంటున్నారు
హైదరాబాద్: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకుండా, వారిని కాపాడుకునేందుకోసం టీడీపీ ప్రభుత్వం స్పీకర్ కుర్చీని కూడా వాడుకుంటోందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రూల్ 71 ప్రకారం స్పీకర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు అందిన 14 రోజుల తర్వాతే చర్చ జరగాలని అన్నారు. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం లేకుండా వెంటనే అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టారని విమర్శించారు. మంగళవారం రెండున్నర గంటలు వాయిదాపడిన ఏపీ అసెంబ్లీ మళ్లీ ప్రారంభమైంది.
స్పీకర్పై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అంశాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రస్తావించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, నిస్సిగ్గుగా టీడీపీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే ఉప ఎన్నికలు వస్తాయని, ప్రజల దగ్గరకు వెళితే మళ్లీ గెలుస్తామనే నమ్మకం టీడీపీకి లేదని, అందుకే ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సభలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
- మా పార్టీ బీ ఫారాల మీద గెలిచిన వ్యక్తులను మీరు ప్రలోభాలు పెట్టి మీ అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారు.
- అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత ఒక డేట్ ఇచ్చి, దానికన్నా నాలుగు రోజుల ముందు చెప్పి మోషన్ మూవ్ చేయాలి
- 8 మంది సభ్యులను అనైతికంగా తీసుకుని, వారికి విప్ జారీ చేసే అవకాశం ఇవ్వకుండా, వారిని రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నారు
- విప్ అందుకుని వచ్చేంత టైం లేదని వాళ్లతో చెప్పించి, డెమోక్రసీకి అర్థం లేకుండా చేస్తున్నారు
- వాళ్ల దగ్గర సంఖ్యాబలం ఉంది కాబట్టి రూల్స్‌ను సస్పెండ్ చేసుకోవచ్చు
- ప్రతి సందర్భంలోనూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి లేస్తారు, రూల్స్ సస్పెండ్ చేస్తున్నట్లు చెబుతారు
- అలా అంటే ఇక ఏ రూల్స్ ఉండవు
- 1952లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులోకి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చారు
- పదవి ఆశ చూపించి జరిగే పార్టీ ఫిరాయింపుల నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ చట్టాన్ని తెస్తున్నట్లు చెప్పారు
- ఈ రోజు ఇదే చట్టసభలో ఉన్న మనం ఆ స్ఫూర్తిని పక్కన పెట్టి, కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే వాటిని ఉల్లంఘిస్తుంటే సిగ్గుతో తల వంచుకోవల్సి వస్తోంది
- రాజకీయాల్లో ఉండాలంటే రెండు లక్షణాలు ఉండాలి. అవి కారెక్టర్, క్రెడిబులిటీ.. అంటే వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి
- ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ చంద్రబాబుది