'ప్రభుత్వం యువతను దొంగలుగా మారుస్తోంది'
హైదరాబాద్: నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఏపీలో ఉద్యోగాల భర్తీ , నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ఆర్ సీపీ సభ్యడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ చేసేందేమీ లేదన్నారు. వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పారని, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని ఆయన గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలైన ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు.
మరో సభ్యడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..నిరుద్యోగ యువకులను ప్రభుత్వం దొంగలుగా మారుస్తోందని మండిపడ్డారు. చైన్ స్నాచింగ్ లలో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 48 వేల ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వమే చెబుతోందన్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి చెల్లించేంత వరకు వదలబోమని అన్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారా? లేదా అని ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ ప్రశ్నించారు. ఆ హామీని ఎప్పటినుంచి అమలు చేస్తారని నిలదీశారు. రాష్ట్రంలో కోటి 75 లక్షల మంది హౌస్ హోల్డ్ కార్డుదారులున్నారని, వారందరికీ ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ను విడుదల చేయాలని మరో ఎమ్మెల్యే చాంద్ భాషా డిమాండ్ చేశారు.