ఆయన ఇప్పటికైనా రాజీనామా చేయాలి
ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్టను చదివించారని, అందులో పేజిన్నర వరకు నీతి, న్యాయాల గురించి రాశారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో తనకు లోకస్ స్టాండీ లేదని హైకోర్టులో తీర్పు ఇచ్చారని, ఎమ్మెల్యేలను కొంటే అది ఏసీబీ పరిధిలోకి రాదని చెప్పారని.. దాంతో హైకోర్టు నిర్ణయాన్ని తాను సుప్రీంలో సవాలు చేశానని అన్నారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులిచ్చిందని తెలిపారు.
అసలు 'క్రిమినల్ లా'లో లోకస్ స్టాండీ అనే పదానికి అర్థం లేదని, సీఆర్‌పీసీ 39, 190 ప్రకారం దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా దేశ పౌరుడు ఎవరైనా ప్రైవేటు కేసు వేయచ్చని చట్టాలు స్పష్టంగా చెప్పాయని ఆర్కే చెప్పారు. గతంలో పలు కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించానని అన్నారు. తనకు అసవరం లేని తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారని, ఆయన 'మనోళ్లు దే బ్రీఫ్‌డ్ మీ' అంటూ చెప్పిన గొంతును ఫోరెన్సిక్ లాబ్‌లో రుజువు చేసి మరీ కోర్టులో ఉంచామని వివరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఆయనకు నోటీసులు ఇచ్చిందని, దేశంలో చట్టాలు, న్యాయాలు ఇంకా బతికే ఉన్నాయని ఈ ఆదేశాలతో తెలుస్తోందని అన్నారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రాజీనామా చంద్రబాబు చేయాలని కోరుతున్నామన్నారు.