ఉంగరాలు సరే.. నల్లధనం మాటేమిటి? | YS Jagan Mohan Reddy fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

ఉంగరాలు సరే.. నల్లధనం మాటేమిటి?

Published Thu, Mar 23 2017 2:44 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

ఉంగరాలు సరే.. నల్లధనం మాటేమిటి? - Sakshi

ఉంగరాలు సరే.. నల్లధనం మాటేమిటి?

చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఇసుక నుంచి ఇరిగేషన్‌ వరకు అన్నీ అవినీతి మయం
ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి.. హోదాకు కట్టుబడి ఉన్నాం.. ఎంపీల చేత రాజీనామా చేయిస్తాం


సాక్షి, అమరావతి: చేతికి వాచీ ఉంగరాల్లేవంటారు కానీ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఇస్తూ ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయారు.. ఆ బ్లాక్‌మనీ సంగతేమిటి? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును  ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘తన చేతికి ఉంగరాలు, వాచీ లేవని, బతకడం కోసమే తిండి తింటున్నానని చంద్రబాబు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా జగన్‌ ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత జగన్‌ తన ఛాంబర్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన చేతి వేళ్లను చూపిస్తూ... ‘‘నేనూ ఉంగరాలు పెట్టుకోలేదు. వాచీ పెట్టుకోలేదు. మెడలో ఒక్క గొలుసు వేసుకున్నా...(దాన్ని చూపిస్తూ) ఇది కూడా దేవుడిది. అయినా నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు.’’ అని ప్రశ్నించారు. ఆయనేమన్నారంటే..

నల్లధనం ఇస్తూ దొరికిపోయిందెవరు?
‘‘నాన్న చనిపోయి ఎనిమిదేళ్లయింది. ఎందుకు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు?  వాళ్లయితే (చంద్రబాబు) ఏం చెప్పినా చెల్లి పోతుందా! అయినా ఓటుకు కోట్లు కేసులో సూట్‌కేసులో కోట్ల కొద్దీ నల్లధనాన్ని తీసుకెళ్లి ఇస్తూ దొరికింది నేను కాదు కదా? ఆ నల్లధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆడియో, వీడియో టేపుల గురించి ఫోరెన్సిక్‌ నివేదిక కూడా చెప్పింది. రాష్ట్రంలో ఏది చూసినా మట్టి నుంచి ఇసుక దాకా అన్నీ కుంభకోణాల మయమే. అన్నింటా అవినీతే. మద్యంలో, చివరకు పుష్కరాల్లో కూడా.. దేవుణ్నీ వదల్లేదు, కనకదుర్గమ్మ, సదావర్తి భూములనూ వదల్లేదు. ఓ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన సంఘటన దేశంలో ఎక్కడా జరగలేదు. సీఎంగా ఉన్న వారు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. కేసు పూర్వాపరాలు విన్నాకే సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది.  అలాంటి పెద్ద మనిషి బయటికి మాత్రం నా చేతికి ఉంగరాలు లేవు, వాచీ లేదు అంటారు.  తప్పుడు పనులన్నీ తాను చేసి అవతలి వాళ్లపై బురద జల్లుతారు.

ఎంపీలతో రాజీనామాలు  చేయిస్తాం
ప్రత్యేక హోదా సాధన కోసం మా ఎంపీలు రాజీనామాలు చేస్తారు. మూడేళ్లు పూర్తి కావాలనేది మా ఆలోచన...  ఆ తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కచ్చితంగా మా ఎంపీలు రాజీనామా చేస్తారు.  జులై తరువాత వచ్చే సమావేశాల్లో మా ఎంపీలు ఎందుకు రాజీనామా చేస్తున్నారో దేశం మొత్తం చూడాలి. ఎందుకు ఎలక్షన్లకు వెళుతున్నారో దేశం మొత్తానికి తెలియాలి.  పార్లమెంటునే సాక్షిగా చేస్తూ, పార్లమెంటులో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది కాబట్టి వారికి బుద్ధి రావాలన్న ఆలోచనతో ఇంతమంది పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తున్నారు. 

ఇచ్చిన మాటపై వెనుకడుగు వేస్తున్నారు కాబట్టి మేం నిరసన తెలుపుతున్నామనే విషయం ప్రజల్లోకి వెళుతుంది. దేశవ్యాప్తంగా ఈ అంశం విస్తృతంగా చర్చకు దారి తీస్తుంది. ప్రజల్లో పెద్ద స్థాయిలో స్పందన ఉందంటే దానిపై ప్రభుత్వం కూడా చర్చకు తావిచ్చే అవకాశం ఉంటుంది. నాకున్న ఆరుగురు పార్లమెంటు సభ్యులు కచ్చితంగా రాజీనామా చేస్తారు.  దేశం మొత్తాన్ని జాగృతం చేస్తాం.  దేశం మొత్తం ఎన్నికల వైపు చూడాలన్నదే మా లక్ష్యం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను తప్పడమనేది వెటకారం కానే కాకూడదు.

వారితో రాజీనామాలు చేయించండి
చదువుకున్న వాళ్లూ, ఉపాధ్యాయులూ ఇచ్చిన ప్రత్యక్ష ఎన్నికల తీర్పులో మేం గెలుపొందాం. నేను మళ్లీ చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా.... మా వద్ద నుంచి ప్రలోభాలు పెట్టి, ఆశలు చూపి టీడీపీలో చేర్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయించండి లేదా వారి చేత రాజీనామాలు చేయించండి ఉప ఎన్నికలకు వెళదాం. (21 స్థానాల్లోనే ఎందుకు? ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరి చేత  రిజైన్‌ చేయించి ఎన్నికలకు వెళ్లమనండి...’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారని కొందరు మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.) మొత్తం 175 స్థానాల్లోనూ ఎన్నికలకు పోదాం పదండి....కమాన్‌... నేను రెడీ!.

ఆశలు చూపించి, ఏమేమో చేసి మా నుంచి 21 మంది ఎమ్మెల్యేలను తీసుకు పోయారు. స్పీకర్‌ పదవిని అడ్డం పెట్టుకుని, స్పీకర్‌ మీవారే కనుక ప్రజాస్వామ్యాన్ని  ఖూనీచేసి వాళ్లు అనర్హులు కాకుండా చూస్తున్నారు. వాళ్లు మీ ఎమ్మెల్యేలు కాదు. మీ పార్టీ మీద గెల్చిన వాళ్లు కాదు.. ముఖ్యమంత్రికి దమ్మూ,, ధైర్యం ఏ మాత్రం ఉన్నా... కొద్దో గొప్పో ఏ కోశాన ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తిగా ఆ స్థానానికి గౌరవం ఇచ్చి వారందరినీ అనర్హులను చేయించాలి. లేదా రాజీనామా చేయించాలి. ఎన్నికలకు పోదాం. వారికి మీ పార్టీ టికెట్లు ఇవ్వండి. నేను మా పార్టీ గుర్తు మీద అభ్యర్థులను నిలబెడతాను.

అది మీ ధర్మం. నిజంగా చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రజల మీద నమ్మకం ఉంటే,  తన పాలన  బాగుందనిపిస్తే, ప్రజలు తనకు ఓట్లేస్తారని నమ్మకముంటే రెఫరెండంగా తీసుకుందాం. 21 స్థానాలంటే ‘ఇట్‌ ఈజ్‌ బిగ్‌ మాండేట్‌’ మా తరఫున మేము కొత్త అభ్యర్థులను పెట్టుకుంటాం. మీరంతా కొనుగోలు చేసిన వారితో ఎన్నికలకు రండి. చూద్దాం.. దేవుడు ఎవర్ని ఆశీర్వదిస్తారో, ప్రజలు ఎవర్ని దీవిస్తారో.. చంద్రబాబుకు  కొద్దో గొప్పో ప్రజాసామ్యాన్ని కాపాడాలన్న ఇంగిత జ్ఞానం ఉంటే ఆ పని చెయ్యాలి’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement