
‘దగ్గుపాటి, హరికృష్ణ, తమ్ముడ్ని కూడా మోసం’
హైదరాబాద్: కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని, కేసులంటూ పెడితే ముందు బస్సు ప్రమాదంతో 11మంది ప్రాణాలు బలితీసుకున్న జేసీ బ్రదర్స్‌పైనే పెట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ పదజాలం దారుణంగా ఉందని, వారి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై చాలా దారుణంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్ల రామయ్య భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉందన్న ఆయన జేసీ బదర్స్, వర్ల రామయ్య, చింతమనేని మాటలు సరికాదని అన్నారు. మూడేళ్లు పరిపాలన చేసిన ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం టీడీపీకి లేదని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత శ్రీకాంత్‌రెడ్డిపై నోరు పారేసుకున్నారని, చంద్రబాబు సాక్షిగా జేసీ నోరు జారారని, ఇంకా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ముందు అరెస్టు చేయాల్సింది జేసీ బ్రదర్స్‌నేనని అన్నారు. హత్యారాజకీయాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకునే మనస్తత్వం చంద్రబాబుదేనని, ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబే ధ్వజమెత్తారు. వంగావీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
బంధువులను నమ్మించి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని, దగ్గుపాటి, హరికృష్ణ, ఆఖరికి సొంత తమ్ముడిని కూడా మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని తీవ్ర ధ్వజమెత్తారు. రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని, ఇతరులకు చెప్పేముందు చంద్రబాబు ముందు తన సంగతి చూసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ఎంతో మందిని బెదిరించారని, ఆయన పెట్టే పిచ్చి కేసులకు ఎవరూ భయపడరని, రోజాను అడ్డుకోవడంతో చంద్రబాబు అరాచకం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, సోనియా ఏకమై కేసులు పెట్టినా వైఎస్ జగన్ బెదిరిపోలేదని, కుట్రలు, కుతంత్రాలను వైఎస్ జగన్ ఒంటిచేత్తో ఎదుర్కొన్నారని అంబటి గుర్తు చేశారు.