సాక్షి, అమరావతి, హైదరాబాద్ : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకున్నాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాలరాశాయని పేర్కొంటూ.. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందించారు. చంద్రబాబు సంతలో గొర్రెల్ని, బర్రెల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొని రాజ్యాంగాన్ని అవహేళన చేశారనీ, అందుకనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నామని కరుణాకర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై గల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీసీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని భవిష్యత్తును నిర్దేశించిన మహామూర్తి అంబేద్కర్ అని కొనియాడారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు గారుస్తూ సుప్రీం తీర్పు ఇచ్చినప్పుడు నోరు మెదపని ప్రధాని మోదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మొసలి కన్నీరు కారుస్తున్నారని రాఘవులు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment