చాపలో మృతదేహాన్ని చుట్టి బల్ల రిక్షా పై ఇంటికి తరలిస్తున్న దృశ్యం
బతికున్నప్పుడే భోగమంతా.. పోతాపోతా.. ఎంత గొప్ప కోటీశ్వరుడైనా వెంట ఒక్క పైసా కూడా తీసుకువెళ్లలేడు. ఈ నగ్నసత్యం అందరికీ తెలిసిందే అయినా... జీవనయానంలో ఎవరికి వారు ఎదుటివాడిని అందినకాడికి దోచుకోవడమేపరమావధిగా... మానవత్వ విలువలను పూర్తిగా విస్మరిస్తున్నారు. మృతదేహాల తరలింపునకు ప్రభుత్వం ఎటువంటి బాధ్యతా తీసుకోకపోవడంతో ప్రయివేటు వాహనాల వారు వేలకు వేలు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు మృతదేహాన్ని ఇంటికి చేర్చడమూ ఓ ప్రహసనంగా మారింది. కొందరు బంధువులు ముందుకొచ్చి తలా ఓ చేయి వేస్తే ఎలాగోలా తరలిస్తున్నారు. అది కూడా లేని వారికి బల్లరిక్షాలే గతి...
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాల నుంచి మృతదేహాలను ఇంటికి తరలించటం బాధిత కుటుంబాలకు ఒక ప్రహసనంగా మారింది. వైద్యశాలలో చికిత్స పొందతూ అనారోగ్యంతో మృతి చెందడం, లేదా రోడ్డుప్రమాదాల్లో దుర్మరణం చెందిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. మృతదేహాలను తీసుకువెళ్లే వాహనాల వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రయివేట్ అంబులెన్స్ వాహనదారులు వేలకు వేలు దండుకుంటున్నారు. కిలోమీటర్లతో సంబంధం లేకుండా మృతదేహం వాహనం ఎక్కిస్తే కనీసం రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇతర గ్రామాలకైతే రూ.10వేల వరకు తీసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ప్రయివేట్ వాహనదారుల ఆగడాలు శృతిమించాయి. బాధిత కుటుంబాల వారు గత్యంతరం లేక తలా కాస్తా వేసుకుని అయినా వారు అడిగినంత ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో నెలకు సుమారుగా 40 వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. మృతదేహాల తరలింపునకు వాహనాలు సమకూర్చాలని బాధితుల తరఫు బంధువులు అనేకమార్లు వైద్యశాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికి ఎటువంటి ఫలితం దక్కలేదు. గతంలో నిర్వహించిన ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎంపీ నిధులతో వాహనం సమకూర్చేందుకు కృషి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే కమిటీ సభ్యుల నిర్లక్ష్యమో లేక రాజకీయ కారణాలో తెలియదు కానీ ఏళ్లు గడుస్తున్నా వాహనం అందుబాటులోకి రాలేదు.
మహాప్రస్థానం జిల్లా కేంద్రాలకే పరిమితం
మృతదేహాల తరలింపునకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాప్రస్థాన వాహనం జిల్లా కేంద్రాలకే పరిమితమయ్యాయి. ఒక్క గుంటూరు జీజీహెచ్‌లో మినహా ఆ వాహన సేవలు ఇతర ఏ పట్టణంలో అందుబాటులో లేదు. దీంతో ప్రభుత్వ వైద్యశాల నుంచి మృతదేహాలను తరలించేందుకు ప్రయివేట్ వాహనాలకు వేలకువేలు వెచ్చించాల్సి వస్తోంది. తొలి విడత జిల్లా కేంద్రాలకు రెండో విడత పట్టణాలకు వాహనాలను సమకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.
పేదల పరిస్థితి దారుణం
పేద, బడుగు బలహీన వర్గాల పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాల తరలింపునకు వేల రూపాయలు వెచ్చించి అంత్యక్రియలకు అవసరమైన డబ్బులు సమకూర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి మృతదేహాల తరలింపునకు వేల రూపాయలు చెల్లించలేక ఆటోల్లోనూ, బల్ల రిక్షాలపై తరలిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మృతదేహాల తరలింపునకు వాహనాలు సమకూర్చాలని పేదలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment