
సాక్షి, రాయవరం (మండపేట): ‘మాలాంటి కష్టాలు మా పిల్లలు పడకూడదు. వారిని ఉన్నతంగా చదివించాలి. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయా లి..’ సగటు తల్లిదండ్రుల ఆలోచనలు ఇలాగే ఉం టాయి. అయితే కొందరు బిడ్డలను చదివించాలనే కోరిక ప్రబలంగా ఉన్నా.. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే బడి మానిపించేస్తున్నారు. బాగా ఖరీదైపోయిన కార్పొరేట్ విద్య కారణంగా వారి కలలు కల్లలుగానే మిగిలి పోతున్నాయి. పేదింటి పిల్లలకు చదువు అందని ద్రాక్షగా మారుతోంది. ఈ కారణంగా పిల్లలను బడికి పంపే తల్లులకు భరోసానివ్వాలనే సత్సంకల్పంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
రాజన్న బాటలో..
జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ 4,346 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటి ల్లో సుమారు 4.08 లక్షల మంది చదువుకొంటున్నారు. వివిధ కారణాలతో అసలు బడికి రాని వారు, మధ్యలో బడి మానేస్తున్న వారు కూడా పలువురు ఉన్నారు. అటువంటి పేదల చదువు కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన బాటలోనే తనయుడు జగన్ కూడా పయనిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులను తల్లిదండ్రులు పనులకు తీసుకుపోతున్నారు. దీంతో వారికి చదువు అందని ద్రాక్షగా మారుతోంది. దీనిని గుర్తించిన జగన్ నవరత్న పథకాల్లో భాగంగా ‘అమ్మ ఒడి’ని ప్రవేశపెట్టారు. పార్టీ అధికారంలోకి రాగానే తమ చిన్నారులను పాఠశాలలకు పంపే తల్లి ఖాతాలోకి ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తారు.
విద్య ప్రైవేటీకరణకు టీడీపీ యత్నం
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. విలీనం పేరుతో గత మూడేళ్లలో సుమారు 50 వరకూ బీసీ, ఎస్సీ హాస్టళ్లను మూసివేశారు. క్రమబద్ధీకరణ అనో, ఏదో ఒక పేరుతోనో ఏటా ప్రభుత్వ బడులను కుదిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి, పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న పలువురు మంత్రులు కార్పొరేట్ విద్యాసంస్థలకు అధినేతలు కావడంతో విద్య పూర్తిగా ప్రైవేటు రంగు పులుముకుందనే ఆరోపణలున్నాయి. చాలామంది తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలలకు పంపించే స్థోమత లేక, ఆర్థిక కారణాలతో బడి మానిపించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఒడి పథకం అమల్లోకి వస్తే లక్షల మంది పేద విద్యార్థులకు మేలు కలగనుంది.
‘అమ్మ ఒడి’ అమలు ఇలా..
∙ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ బడికి పంపే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500, ఇద్దరుంటే రూ.1,000 ఇస్తారు.
∙ఐదు నుంచి పదో తరగతి వరకూ బడికి వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.750, ఇద్దరుంటే రూ.1,500 ఇస్తారు.
∙ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.వెయ్యి, ఇద్దరుంటే రూ.2 వేలు ఇస్తారు.
∙ఇంటర్ తరువాత డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా అమలు చేస్తారు.
స్థోమత లేని తల్లిదండ్రులకు వరం
ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన అమ్మ ఒడి పథకం ద్వారా అక్షరాస్యత పెరుగుతుంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తుందని భావిస్తున్నా. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులకు ఈ పథకం ఆసరాగా ఉంటుంది.
– గుత్తుల సతీష్‌కుమార్, గుడిగళ్ల, కె.గంగవరం మండలం
విద్యా కుసుమాలు విరబూస్తాయి
జగన్ నిర్ణయాలు, చెప్పే మాటలపై ప్రజల్లో పూర్తి విశ్వాసముంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే పేదల సంక్షేమం కోసం జగన్ ఆలోచిస్తున్నారు. అద్భుతమైన పథకాలను నవరత్నాల రూపంలో ప్రకటించారు. అమ్మ ఒడి పథకం ద్వారా పేదల ఇళ్లల్లో విద్యా కుసుమాలు విరబూస్తాయి.
– గెద్దాడ సుగుణశాంతికుమారి, గృహిణి, మండపేట
పేద విద్యార్థులకు వరం
అమ్మ ఒడి పథకం కచ్చితంగా అమలు చేస్తే పేద విద్యార్థులకు వరంగా మారుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టి ఉన్నత విద్యను పేదలకు దగ్గర చేశారు. ఎంతోమంది పేద పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లుగా మారారు. అమ్మ ఒడి కూడా ఇలాంటి ఫలితాలనే అందిస్తుందని భావిస్తున్నాం.
– బి.సిద్దు, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్‌యూ, కాకినాడ