మడకశిర, న్యూస్‌లైన్ : మడకశిరలో ఇద్దరు చిన్నారుల హత్యపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి చిన్నారుల హత్యను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఫలితంగా మడకశిర పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు నానాతంటాలు పడాల్సి వచ్చింది.
పట్టణంలోని ఎస్‌బీఐ వెనుకభాగంలోని కాలనీలో నివాసముంటున్న ఆనందప్ప, సాకమ్మ అనే ఉపాధ్యాయ దంపతుల కుమార్తె మంజువాణి (13), కుమారుడు రంగనాథ్ (8) గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యారు. మంజువాణిని చున్నీతో గొంతుబిగించి, రంగనాథ్‌ను టవల్‌తో గొంతునులిమి హతమార్చారు. ఈ హత్యల విషయం పట్టణంలోనే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా దావానలంలా వ్యాపించడంతో వేలాది మంది ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు కన్నీళ్లపర్యంతమయ్యారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఆస్పత్రి నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులను కాల్చి చంపాలని, ఉరితీయాలని నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీస్‌స్టేష న్‌ను ముట్టడించి, నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్ ఎదుట దాదాపు గంటసేపు బైఠాయించారు. అదే సమయంలో అమరాపురం నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. డీఎస్పీ సుబ్బారావు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
ఆందోళనకారులను పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా గేటువేసి పోలీసులు అడ్డగించారు. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహానికి లోనుకావడంతో పెనుకొండ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, స్థానిక ఎస్‌ఐ సద్గురుడు తదితర పోలీసులు వారిని అదుపుచేయడానికి నానాతంటాలు పడ్డారు. చివరకు పోలీస్‌స్టేషన్ వద్దకు పెనుకొండ డీఎస్పీ చేరుకుని నిందితులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో ఎన్‌జీఓ సంఘం నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అదనపు బలగాలు పంపాలని కోరిన డీఎస్పీ
మడకశిరలో చిన్నారుల దారుణ హత్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మడకశిరకు సీఐ కూడా లేరు. సిబ్బంది కొరత కూడా ఉంది. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు శుక్రవారం అందించనున్నారు. అంతవరకు ఉద్రిక్త వాతావరణం ఉండే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అదనపు బలగాలను పంపాలని ఉన్నతాధికారులను కోరినట్లు పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు.
హత్యలపై ఎస్పీ ఆరా
మడకశిరలో చిన్నారుల హత్యలను జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ హత్యలపై పలుసార్లు పెనుకొండ డీఎస్పీతో ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. వెంటనే నిందితులను అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కోరారు. ఈ హత్యలకు సంబంధించిన కేసుపై కొంతవరకు పురోగతి సాధించినట్లు ఎస్పీకి డీఎస్పీ వివరించారు.
ట్రైనీ ఎస్పీ మడకశిరలో మకాం
చిన్నారుల హత్యల నేపథ్యంలో ట్రైనీ ఎస్పీ శ్వేత వెంటనే మడకశిరకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ హత్యలు జరిగిన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో చర్చించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులను ఈ సంఘటనపై విచారించారు.
అనుమానితుల ఇంటిపై దాడి
అనంతపురం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ మృతుల ఇంటి సమీపానికి 50 మీటర్ల దూరంలో ఉన్న మరో ఇంటి వద్దకు వెళ్లి ఇద్దరు యువకులను గుర్తించింది. వీరే తమ పిల్లలను హత్య చేశారని కోపాద్రిక్తులైన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు మూకుమ్మడిగా ఈ యువకుల ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని టీవీ, ఫర్నీచర్‌ను రోడ్డుపైకి వేసి ధ్వంసం చేశారు. విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ సుబ్బారావు, పెనుకొండ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, స్థానిక ఎస్‌ఐ సద్గురుడు తదితరులు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా.. అనుమానిత కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పోలీసులు ఈ ఇంటి వద్ద కూడా బందోబస్తును కొనసాగిస్తున్నారు.
అమానుషం
Published Fri, Apr 4 2014 3:13 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement