
అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు
విశాఖపట్నం: ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో అనకాపల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సహా 15 మందికి జీవితఖైదు విధించింది. మరో ఐదుగురికి రెండేళ్ల జైలు శిక్ష వేసింది. పదేళ్ల క్రితం నక్కపల్లి మండలంలో బంగారమ్మపేటలో బీఎంసీ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో గోసల కొండ అనే మత్స్యకారుడు మృతి చెందాడు. అతడి మరణానికి నాటి ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అనుచరులే కారణమని కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన అనకాపల్లి సెషన్స్ 10వ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా చెంగల వెంకట్రావు నిర్మించిన ‘సమరసింహారెడ్డి’ సినిమా విజయవంతం కావడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. తర్వాత టీడీపీలో చేరారు. 1999, 2004 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా చెంగల ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్ల బాబూరావు చేతిలో ఓడిపోయారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు.