
జైపాల్‌రెడ్డే పెద్ద శుంఠ: ఎమ్మెల్యే ఆనం
సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డే పెద్ద శుంఠ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నెల్లూరు: సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డే పెద్ద శుంఠ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఎపీ ఎన్‌జీవోల సంఘం నెల్లూరు తాలూకా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ బిల్లు ప్రతులను, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్‌ను కూల్చివేస్తామని, ఆఖరు బంతికి బదులు బాంబులు వేస్తామని తీవ్రపదజాలం వాడుతున్న ఎంపీ పొన్నం ప్రభాకర్ చర్యలు ఉగ్రవాద చర్యలుగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ నేతలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు వీరెలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు.
ఇప్పటివరకు రాష్ట్రానికి 12 మంది తెలంగాణ ప్రాంతం వారే ముఖ్యమంత్రులుగా పనిచేశారన్నారు. టీఆర్‌ఎస్ నాయకుడు ఈటెల రాజేంద్ర చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడారని విమర్శించారు. సాధారణ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతినే మాట్లాడటం సమంజసం కాదన్నారు.