‘అనంత'లో మద్యం సిండికేట్
అనంతపురం క్రైం :
జిల్లా కేంద్రంలో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ పోలీసులు సిండికేట్ అయ్యారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం వల్ల బీరు ధర ఎమ్మార్పీ కంటే రూ. 15 ఎక్కువకు అమ్ముడుపోతోంది. అంతేకాక ప్రతి షాపులోనూ లూజు విక్రయాలు ఊపందుకున్నాయి. గతంలో ఎమ్మార్పీ కంటే క్వాటరపై రూ. 10, బీరుపై రూ.10 ఎక్కువగా తీసుకుని విక్రయించేవారు.
దీపావళి పండుగ తర్వాత బీరుపై అదనంగా రూ. 5 పెంచి గరిష్ట ధర కంటే రూ. 15 ఎక్కువ వసూలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మద్యం సిండికేట్లలో తల దూర్చడం వల్లనే పోలీసు, ఎక్సైజ్ శాఖలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బ్రాంది, విస్కీ, ఇతర లిక్కరుపై కూడా ధర పెంచే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నిబంధనలు తుంగలోకి : మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలకు అనుమతి లేదు. ఐదు వేలు జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రతి షాపునకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుని పర్మిట్ పొందవచ్చు. షాపులో కొనుగోలు చేసిన మద్యంను ఈ గదుల్లో తాగేందుకు అనుమతిస్తారు. గ్లాసులు కాని, ఇతర తినుబండారాలు కాని విక్రయించకూడదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యం అమ్మాలి. అలా కాకుండా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం కల్పించింది.
నిబంధనలు అతిక్రమిస్తే ఏకంగా మద్యం షాపునకు ఉన్న అనుమతిని రద్దు చేసే అధికారం ఎక్సైజ్ అధికారులకు ఉంది. మద్యం కొనుగోలు చేసిన వారు తప్పక రసీదును పొందాల్సి ఉంటుంది. అలా ఇవ్వని వారిపై జరిమానా విధించే అధికారం తూనికలు కొలతల శాఖతో పాటు ఎక్సైజ్ అధికారులకు ఉంది. అయితే ఈ నిబంధనలు అన్ని తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లూజు విక్రయాలు సాగిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు సైతం మాముళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.