అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : అనంతపురం నగరంలో మహిళా ఉద్యోగుల ‘నారీ గర్జన ’కు వేలాది మంది కదలివచ్చారు. స్థానిక తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి.. సప్తగిరి సర్కిల్ మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహిళా జేఏసీ నేతలు... సోనియా, సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా దుమ్మెత్తిపోశారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తున్న వీరి రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా... ఈ నెల 29 వరకు మూకుమ్మడిగా కోర్టు విధులు బహిష్కరించాలని సీమాంధ్ర జిల్లాల న్యాయవాదులు తీర్మానించారు. స్థానిక కమ్మభవన్‌లో నిర్వహించిన న్యాయవాదుల సదస్సులో 13 జిల్లాలకు చెందిన జేఏసీ నేతలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులకు ఉచిత న్యాయ సహాయం చేస్తామని ప్రకటించారు.
ఈ నెల 28న హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదుల బహిరంగసభ, అక్టోబర్ 5,6 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించారు. జాక్టో, పంచాయతీరాజ్, ఎన్‌జీవో, హంద్రీ-నీవా, వాణిజ్యపన్నులశాఖ, కార్పొరేషన్ ఉద్యోగులు, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు కొనసాగిస్తూనే... మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. విభజిస్తే ఉరే శరణ్యమంటూ పలువురు సమైక్యవాదులు.. ఉరితాళ్లు మెడకు తగిలించుకుని నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరంలో మహిళా గర్జనకు జనం పోటెత్తారు. ఉద్యోగ జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగాయి. పట్టణంలో ప్రధాన రహదారులను దిగ్బంధించారు.
ఓ సమైక్యవాది ఒంటికి పేపర్లు చుట్టుకుని నిరసన తెలిపారు. ముదిగుబ్బలో మహిళా గర్జనలో సమైక్య నినాదాలు మార్మోగాయి. గుంతకల్లులో వివిధ జేఏసీలు, వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు రిలే దీక్షలను కొనసాగించారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పామిడిలో మహిళలు, గుత్తిలో ఆర్‌ఎంపీ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. గుత్తిలో సమైక్యవాదులు కేంద్ర కార్యాలయాలను బంద్ చేయించారు. హిందూపురంలో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు కొనసాగాయి. చిలమత్తూరులో ఐసీడీఎస్ ఉద్యోగులు, జేఏసీ నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో హిందీ పండిట్లు రిలే దీక్షకు దిగారు. హిందీ దివస్ సందర్భంగా రోడ్డుపైనే పిల్లలకు ‘సమైక్యాంధ్ర’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. మహిళలు ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు కొనసాగాయి. ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో విద్యుత్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. మహిళలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అమరాపురంలో బంద్ పాటించారు.
మడకశిరలో ఈ నెల 19న నిర్వహించే లక్షగళ గర్జనపై గుడిబండలో ఎంఆర్‌పీఎస్ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. ఓడీసీ, పామిడి, పరిగిలో ఉద్యోగ జేఏసీ నేతలు, అమడగూరులో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. అమడగూరులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పుట్టపర్తిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి రిలే దీక్షలు చేశారు. వారికి పుడా ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. పెనుకొండలో చేపట్టిన రిలే దీక్షల్లో మైనార్టీ మహిళలు, అంగన్‌వాడీలు, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు. గోరంట్లలో మహిళలు, రొద్దంలో విద్యార్థులు, సోమందేపల్లిలో గుడిపల్లి మహిళలు ర్యాలీలు చేపట్టారు.
రాయదుర్గంలో మహిళా గర్జనకు వేలాది మంది హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ వర్గాల సమైక్య శిబిరాల్లో ఆర్‌ఎంపీ వైద్యులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం ప్రకటించారు. కణేకల్లులో బంద్ నిర్వహించగా.. లింగాయత్‌లు ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో ఉపాధ్యాయులు జలదీక్ష చేశారు. గార్లదిన్నె మండలం కల్లూరులో సమైక్యవాదుల ఆమరణ దీక్ష మూడవ రోజూ కొనసాగింది. మహిళా గర్జనతో తాడిపత్రి హోరెత్తింది. వేలాది మంది మహిళలు ర్యాలీ చేపట్టి, మానహారంగా ఏర్పడ్డారు. ఎల్‌ఐసీ ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. యాడికిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దవడుగూరులో విద్యార్థులు సైకిల్ ర్యాలీ, ఉరవకొండలో ఐకేపీ మహిళలు ర్యాలీ నిర్వహించారు.
నారీ గర్జన
Published Sun, Sep 15 2013 4:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement