భూసేకరణ ఆర్డినెన్స్‌పై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్
హైదరాబాద్: భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. దీన్ని సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వాకౌట్ చేస్తే టీడీపీ సభ్యులంతా కిమ్మనకుండా లోపలే ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల వ్యతిరేకతను చూసి కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడి ఎనిమిది మంది సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అన్నాహజారే, మేధాపాట్కర్ వంటి సామాజిక ఉద్యమ నేతలు ఈ ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోసమే ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చినట్లుగా బోధపడుతోందని చెప్పారు. తుళ్లూరు ప్రాంతంలో రైతులను బెదిరించి అంగీకారపత్రాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో తమ పార్టీ శాసనసభాపక్షం తరఫున ఎమ్మెల్యేలు, నేతలు పర్యటించినప్పుడు పలువురు రైతులు ముందుకు వచ్చి ‘మీరు అండగా ఉంటే మేం భూములు ఇవ్వబోం’ అని స్పష్టం చేశారని చెప్పారు. అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులూ వాటిని వెనక్కు తీసుకుంటామని చెప్పారన్నారు. సీఆర్‌డీఏ రైతుల నుంచి అంగీకారపత్రాలు (9.3 ఫారం) తీసుకోవడానికి గడువు పొడిగించినట్లుగానే అభ్యంతరపత్రాలు (9.2 ఫారం) తీసుకునేందుకూ పొడిగించాలని డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల్లో 80 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించలేదని చెప్పారు. ఈ పర్యటనలో తమ దృష్టికి వచ్చిన అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన చెప్పారు.