
సమ్మెలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ఆంధ్రాబ్యాంకు రుణాలు
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ 70 రోజులకు పైబడి సమ్మెలో ఉండి.. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న సీమాంధ్ర ప్రాంత ప్రభుత్వోద్యోగులకు చల్లటి కబురు. వారి ఒక నెల వేతనానికి సమానమైన మొత్తాన్ని రుణంగా అందించేందుకు ఆంధ్రాబ్యాంకు ముందుకొచ్చింది. వాళ్లకు తిరిగి జీతాలు అందిన తర్వాత రెండు వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణానికి 13.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఈ మేరకు బ్యాంకులోని అన్ని శాఖలకూ సమాచారం అందించారు. దీనికి ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోందని బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే, ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారన్న సమాచారం మాత్రం ఇంకా అందాల్సి ఉంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా తరచు బ్యాంకు సేవలకు అంతరాయాలు కలుగుతుండటంతో వివరాలు రావట్లేదని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ జోనల్ మేనేజర్ తెలిపారు. రెండు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో గృహరుణాలు గణనీయంగా పడిపోయాయి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా ట్రెజరీ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఆగిపోయాయి.