
ప్రారంభం.. పలుచగా
ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు.. పీఠాధిపతులదే తొలిపుష్కర స్నానం
* వీఐపీ ఘాట్‌లో జయేంద్ర సరస్వతి, విజయేంద్ర స్వామి పుణ్యస్నానం
* అనంతరం స్నానం ఆచరించిన సీఎం దంపతులు
సాక్షి, అమరావతి/ ఇంద్రకీలాద్రి: పవిత్ర కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పన్నెండేళ్లకు ఒకసారి బృహస్పతి కన్యారాశిలో ప్రవేశంతో ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శుక్రవారం తెల్లవారుజామున 5.40గంటలకు వీఐపీ ఘాట్‌లో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తొలుత కలశస్థాపన, కృష్ణవేణి స్థాపన, ఆవాహన, పూజా కార్యక్రమాలతో కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు. జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర స్వాములు తొలి పుష్కర స్నానం ఆచరించగా.. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర కుటుంబీకులు పుష్కర సాన్నం చేశారు. ప్రభుత్వం ప్రచారార్భాటంతో ఊదరగొట్టినప్పటికీ కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తులు చాలా తక్కువ గా పుణ్యస్నానాలు ఆచరించారు. గత ఏడాది గోదావరి పుష్కరాల తొలిరోజు దుర్ఘటన భక్తులను వెన్నాడుతుండటం... శ్రావణ శుక్రవారం కావడం... ప్రభుత్వం మితిమీరిన ఆంక్షలతో కట్టడి... వెరసి కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 4,51,569 మంది భక్తులు స్నానం చేశారు. వాస్తవానికి అందులో సగంమంది కూడా రాలేదని అధికారవర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం.
పుష్కరాలకోసం కృష్ణా జిల్లాలో 74, గుంటూరు జిల్లాలో 79, కర్నూలు జిల్లాలో 5 ఘాట్‌లు ఏర్పాటు చేశారు. తొలిరోజు దాదాపు అన్ని ఘాట్‌లలో భక్తులు చాలా పలుచగా కనిపించారు.
పుష్కర స్నానం పవిత్రం: జయేంద్ర సరస్వతి
ఎనిమిది తీర్థాలు కలిసిన కృష్ణా పుష్కర స్నానం ఎంతో పవిత్రమైనదని, పుష్కర స్నానం ఆచరించిన భక్తులందరూ సుఖ సంతోషాలను కలిగి ఉంటారని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి చెప్పారు. కృష్ణా పుష్కర సంకల్ప కార్యక్రమాన్ని జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర స్వామిలతో పాటు పలువురు పీఠాధిపతులు శాస్త్రోక్తంగా నిర్వహించగా, పూజా కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ర్టంలోని 13 జిల్లాలోని పలు ఆలయాల నుంచి సేకరించిన పసుపు, కుంకుమ, పూలతోపాటు టీటీడీ తరఫున పట్టుచీర, పూజా ద్రవ్యాలను డాలర్ శేషాద్రి, ఇతర తిరుమల అర్చకులు సీఎం చంద్రబాబుకు అందచేశారు. సీఎం చంద్రబాబు దంపతులు కృష్ణమ్మకు సారెను సమర్పించారు
పుష్కరాల తీరును పరిశీలించిన సీఎం
సీసీ కెమెరా విజువల్స్‌లో వీక్షణ
విజయవాడ (లబ్బీపేట)/ఇంద్రకీలాద్రి: కృష్ణా పుష్కరాలు జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎంజీ రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించారు. వివిధ స్నాన ఘట్టాలు, నగరంలోని ముఖ్యమైన రహదారులు, కూడళ్లలోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల రాకపోకలు వంటి అంశాలను సీసీ కెమెరా విజువల్స్‌లో పరిశీలించారు.
వివిధ శాఖల నుంచి అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు భక్తుల స్పందనను తెలుసుకుని, మరింత మెరుగైన రీతిలో సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇలా ఉండగా గన్నవరం వద్ద విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన కడప జిల్లా రాజంపేట మండలం ఊతుకూరు గ్రామానికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
తొక్కిసలాట భయం వల్లే భక్తుల సంఖ్య తగ్గింది: పల్లె
విజయవాడ సెంట్రల్: గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట భయం కారణంగా కృష్ణా పుష్కరాల్లో తొలి రోజు భక్తుల సంఖ్య తగ్గిందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ర్ట వ్యాప్తంగా పుష్కరాల తొలిరోజు 4,51,561 మంది భక్తులు స్నానమాచరించినట్లు తెలి పారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరి గే అవకాశం ఉందని, ప్రభుత్వ అంచనా ప్రకారం 3.50 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేశామన్నారు. పోలీస్ ఆంక్షలు శృతిమించాయని మంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. పోలీసుల అతి జాగ్రత్త అవసరం లేదని, భక్తులతో పాటు వివిధ శా ఖల అధికారులను ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసులు తీరుమార్చుకోవాలని హోంమంత్రి చినరాజప్ప సూచించినట్లు చెప్పారు.