పుణ్యానికొస్తే.. జేబుకు చిల్లు
పుణ్యానికొస్తే.. జేబుకు చిల్లు
Published Thu, Aug 18 2016 5:45 PM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
పవిత్ర సంగమం ఘాట్ లో పూజ సామాగ్రి విక్రయిస్తున్న పద్మావతి వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. టెంకాయ కావాలని రూ.500 నోటు ఇచ్చాడు, చిల్లర కోసం అటు తిరగ్గానే ఆమె హ్యాండ్ బ్యాగ్‌తో మాయమయ్యాడు. అందులో నాలుగు రోజులు వ్యాపారం చేసిన రూ.40 వేల నగదు, బంగారు రింగులు ఉన్నాయి. ఇటువంటి చేదు అనుభవం మరెందరిదో. పుష్కరాల్లో దొంగలు భక్తులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోలీసులు ఇప్పటికి వంద మందిని పైగా చోరులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ నిత్యం పదుల సంఖ్యలో యాత్రికులు సొమ్ము పోగొట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణల నుంచే కాకుండా నేపాల్, బిహార్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రకరకాల ముఠాలు పుష్కరాలకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క పద్మావతి ఘాట్‌లో రూ.10 నోట్లు పడేసి యాత్రికుల దృష్టిని మరల్చి బ్యాగులను తస్కరించిన కేసులు 31 నమోదయ్యాయి. మంగళవారం ఒక్క రోజే 11 మంది నేరగాళ్లను పోలీసులు పట్టుకుని రూ.5.5 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 23 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
టెక్నాలజీ ఏమైనట్లు
పుష్కరాల్లో నేరాల నివారణకు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామనీ, 15 వేల మంది పోలీసులను మోహరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. భక్తులకు మాత్రం దొంగల బెడద తప్పడం లేదు. పుణ్యానికి వచ్చి లూటీ అవుతున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Advertisement