గందరగోళం మధ్య అసెంబ్లీ సమావేశాలు జనవరి 3వ తేదీకి వాయిదా పడ్డాయి.
హైదరాబాద్ : గందరగోళం మధ్య అసెంబ్లీ సమావేశాలు జనవరి 3వ తేదీకి వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో సమావేశమైన సభ...ఒక్క నిమిషంలోనే ముగిసింది. స్పీకర్ సభలోకి వచ్చేసరికే సభ్యులంతా పోడియంను చుట్టుముట్టారు. జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది.
ఈ దశలో సభను వచ్చేనెల మూడు వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరో వైపు జనవరిలో జరిగే సమావేశాలను అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. జనవరి మూడు నుంచి 10 వరకు, తర్వాత జనవరి 16 నుంచి 23 వరకూ మలిదఫా సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. ఆదివారాలు, సంక్రాంతి సెలవు దినాలను మినహాయిస్తే సభ మొత్తం మలివిడతలో 13 రోజులు సాగనుంది.
కాగా ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. సరిగ్గా నిమిషం పాటు సభ సాగింది. స్పీకర్ సభలోకి వచ్చేటప్పటికీ సభ్యులంతా పోడియంను చుట్టుముట్టారు. జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది. విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. విభజనకు సంబంధించి ఆవేదన ఉంటుందని... దాన్ని వ్యక్తం చేసేందుకు సమయం ఇస్తామని స్పీకర్ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. దయచేసి సభ సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాని సభ్యులెవ్వరూ శాంతించకపోవడంతో... స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.