పోటాపోటీ నినాదాలతో హోరెత్తిన సభ
హైదరాబాద్ : శాసనసభలో సోమవారం వాయిదాల పర్వం కొనసాగుతోంది. నినాదాలు, నిరసనలతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. శాసనసభ ఈరోజు ఉదయం ప్రారంభమైన ఐదు నిమిషాలకే.. అరగంటపాటు వాయిదా పడింది. విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఓటింగ్ నిర్వహించవద్దని, సీఎం కిరణ్ ఇచ్చిన తీర్మానం నోటీసును అనుమతించకూడదని.. తెలంగాణ మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ సభ్యులు స్పీకర్ పోడీయంను చుట్టుముట్టడంతో.. సభలో గందరగోళం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా పోటాపోటీగా సమైక్యాంద్ర, తెలంగాణ నినాదాలతో అసెంబ్లి హోరెత్తింది. దీంతో సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సభను స్పీకర్ మరో గంట పాటు వాయిదా వేశారు.