సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్ : సమైక్యాంధ్ర నినాదాలతో అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లాయి. జై సమైక్యాంధ్ర అన్న నినాదాల మధ్యనే సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సమైక్యాంధ్ర తీర్మానానికి పట్టుబడ్డారు.
వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్.. సభ్యులు ఎటువంటి సంప్రదాయాలను పాటించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో పదిగంటలకు బీఏసీ భేటీ తర్వాత..సభ తిరిగి ప్రారంభమవుతుందని.. స్పీకర్ సభను వాయిదా వేశారు.
సమైక్యతీర్మానం చేయాలన్న వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్‌తో .. వరుసగా మూడో కూడా సభ స్తంభించింది. సభలో ప్రతిష్ఠంభన తొలగించేందుకు ఎట్టకేలకు స్పీకర్ చొరవ చూపుతూ.. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో.. బీఏసీ భేటీ నిర్వహించనున్నారు. గతంలో జరిగిన రెండు బీఏసీ భేటీల్లోకూడా.. సమైక్యాంధ్ర తీర్మానానికి పట్టుపట్టిన వైఎస్‌ఆర్‌సీపీ.. సమైక్య తీర్మానానికి ఆస్కారంలేదని సర్కారు చెప్పడంతో రెండుసార్లు బీఏసీ నుంచి వాకౌట్ చేసింది. శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.