సభ్యుల నిరసనలపై స్పీకర్ అసహనం
హైదరాబాద్ : ఎప్పటిలాగానే ఆందోళనలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనంటూ పార్టీలకతీతంగా ఇరుప్రాంతాలకు చెందిన సభ్యులు స్పీకర్ పోడియంవద్ద ఆందోళనకు దిగడంతో..సభాకార్యకలాపాలు స్థంభించిపోయాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది.
కనీసం ఈరోజు, రేపు చర్చల్లో పాల్గొని.. విభజనపై సభ్యులు తమ అభిప్రాయం చెప్పాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ప్రయోజన లేకపోయింది. ఇరుప్రాంతాల సభ్యుల నినాదాలతో.. సభలో ప్రతిష్ఠంభన నెలకొంది. లిఖితపూర్వకంగా అభిప్రాయాలు చెప్పాలనుకున్నవారు....ప్రతులను సమర్పించాలని కూడా స్పీకర్ విజ్ఞప్తి చేశారు. చర్చలో పాల్గొనే ఆసక్తిలేదా అంటూ స్పీకర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోటంతో గందరగోళం మధ్య సభను గంటపాటు వాయిదా వేశారు.