శోభానాగిరెడ్డి మృతి తీరని లోటు
సంతాపం తెలిపిన ఏపీ అసెంబ్లీ
ఆమెతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, జగన్, భూమా, ఇతర సభ్యులు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాలకే కొత్త ఒరవడి తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మృతి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పేర్కొంది. గురువారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ.. తొలి రోజు శోభా నాగిరెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించడం, అయినప్పటికీ ఎన్నికల్లో ఆమె మంచి మెజార్టీతో గెలవడం తెలిసిందే.
సమస్యలపై పోరాటం చేసిన మహిళ: బాబు
‘‘పలు ప్రజా సమస్యలపై శోభానాగిరెడ్డి పోరాటాలు చేశారు. రాయలసీమ రైతులకు ప్రధాన నీటి వనరు అయిన కేసీ కెనాల్ నీటి కోసం ఆమె అలుపెరగకుండా పోరాటం చేశారు. గత శాసనసభలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఆర్టీసీ చైర్‌పర్సన్‌గా ఆమె తనదైన శైలిలో బాధ్యతలు నిర్వర్తించారు. విధి ఎంత బలీయమైనదో శోభా నాగిరెడ్డి మృతి ఒక ఉదాహరణ. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.’’
సోదరికన్నా ఎక్కువే: జగన్‌మోహన్‌రెడ్డి
‘‘శోభమ్మ నాకు సొంత అక్కలాంటిది. నాన్న చనిపోయాక రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయన మృతి అనంతరం రాజకీయంగా వైఎస్ కుటుంబం అంతరించిపోతుందని అనుకుంటున్న సమయంలో శోభమ్మ నాకు సొంత సోదరికంటే ఎక్కువగా అండగా నిలిచింది. ఓటమి ఎరుగకుండా గెలుస్తూ వచ్చింది. నేను గుంటూరు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె మరణించిన వార్త తెలిసింది. వెంటనే పర్యటన ఆపేసి వచ్చేశాను. ఆమె మరణం నన్నెంతో కలచివేసింది. నాగిరెడ్డి అన్నతో మాట్లాడాను. ముగ్గురు చిన్నపిల్లలను ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి. సమాధానం చెప్పలేని పరిస్థితి. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా ఆళ్లగడ్డ ప్రజలు ఆమెను గెలిపించారంటే ఆ నియోజకవర్గ ప్రజల గొప్పతనం ఏమిటో తెలుస్తోంది. నాగిరెడ్డి అన్న కుటుంబానికి అండగా ఉంటాం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబానికి మనోస్థైర్యాన్నివ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.’’
దేశ చరిత్రలో తొలిసారి: ఎస్వీ మోహన్‌రెడ్డి(వైఎస్సార్ సీపీ)
‘‘మృతి చెందిన మహిళకు ఓట్లేసి గెలిపించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. శాసనసభలో తొలిసారి అడుగుపెట్టిన నాకు తొలిసారి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు చెల్లెలి సంతాప తీర్మానం మాట్లాడాల్సి రావడం బాధాకరం. ఆమెను 18వేల మెజార్టీతో గెలిపించిన ఆళ్లగడ్డ ప్రజలు చాలా గొప్పవాళ్లు.’’
మంచి స్నేహితులం: భూమా నాగిరెడ్డి (వైఎస్సార్‌సీపీ)
‘‘నాకు ఆమె భార్య మాత్రమే కాదు మంచి స్నేహితురాలు కూడా. ఫ్యాక్షన్ రాజ్యమేలుతున్న ఆళ్లగడ్డలో అయిన వాళ్లతో పాటు, కార్యకర్తలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు ఆమె భరోసా ఇచ్చింది. చిన్న వయసులోనే ఇంటికి పెద్దదిక్కుగా నిలబడింది. నేను ఆమెను ప్రేమవివాహం చేసుకున్నాను. మనిద్దరం అసెంబ్లీకి వెళ్లాలని ఆమె అంటూ ఉండేది. అన్నిటికీ మించి రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండాలనుకున్నాం. షర్మిల సభ ముగిసిన అనంతరం విశ్రాంతి తీసుకుని వెళ్లాలని చెప్పాను. కానీ ఆమె ఉదయాన్నే నియోజకవర్గంలో పర్యటించాలని వెళ్లారు. భార్య సంతాప తీర్మానంలో భర్తగా నేను మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదు.’’
ఆమె కుటుంబంతో పాతికేళ్ల సాన్నిహిత్యం: కోడెల(టీడీపీ)
‘‘శోభానాగిరెడ్డి కుటుంబంతో నాకు పాతికేళ్ల సాన్నిహిత్యం ఉంది. ఎస్వీ సుబ్బారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్లం. ఆమె మరణవార్త తెలిసి నమ్మలేకపోయాను. అత్యంత దురదృష్టకర సంఘటన. ఆమె మనమధ్య లేకపోయినా ప్రజలు వేల మెజారిటీతో గెలిపించారంటే శోభ గొప్పతనమేంటో తెలుస్తోంది.’’
ఇతర సభ్యుల సంతాపం..
మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గౌరు చరితారెడ్డి, ఆర్.శివప్రసాద్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బి.రాజశేఖరరెడ్డి, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు శోభా నాగిరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె లేనిలోటు తీర్చలేనిదంటూ సంతాపం తెలిపారు.
తంగిరాల లేని లోటు తీర్చలేనిది..
తెలుగుదేశం పార్టీకి చెందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం సంతాపం తెలియజేసింది. ఆయన లేని లోటు తీర్చలేనిదని సభ పేర్కొంది. సామాన్య కుటుంబంలో పుట్టి మంచి నాయకుడిగా ఎదిగారని, నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారని కొనియాడింది. తంగిరాల ప్రభాకర్‌రావు ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.