సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సుపరిపాలనే’ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మరో ‘కీలక’ హామీ అమలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సీఎస్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో భూ పరిపాలన (సీసీఎల్‌ఏ) కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసులు) కార్యదర్శి, ప్రణాళిక విభాగం కార్యదర్శి.. సీఎంవో నుంచి ఒక ప్రతినిధిని సభ్యులుగా నియమించింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి, త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కమిటీకి నిర్దేశించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను మంత్రి పేర్ని నాని విలేకరులకు తెలిపారు.
మరింత మందికి ‘వైఎస్సార్ చేయూత’
► వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఇప్పటికే లబ్ధి పొందుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు కూడా ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల 8.21 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
► ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 17.03 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు మొత్తంగా 25.24 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.
► తద్వారా అదనంగా ఏడాదికి రూ.1540.89 కోట్ల చొప్పున నాలుగేళ్లకు సుమారు రూ.6,163.59 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. మహిళల ఉపాధి, జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం
వేగంగా ఇసుక సరఫరా లక్ష్యంగా శాండ్ కార్పొరేషన్
► ఇసుకను వేగంగా సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా శాండ్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇసుక సరఫరా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ)కి పని భారాన్ని తగ్గించే దిశగా ఇసుక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
► ఇసుక కార్పొరేషన్‌కు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు ముగ్గురు మంత్రులు (కొడాలి నాని, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్) సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఇసుకకు సంబంధించిన వ్యవహారాలను మంత్రుల కమిటీ పర్యవేక్షించి.. తగిన సలహాలు, సూచనలు ఇస్తుంది.
రాయలసీమ కరవు నివారణే లక్ష్యంగా..
► కృష్ణా నది వరద జలాలను ఒడిసి పట్టి.. దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, కాలువల విస్తరణ పనుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
► రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్టŠస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్) పేరుతో ఎస్పీవీ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. వంద శాతం ప్రభుత్వ కంపెనీగా వ్యవహరించనున్న ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుల పనులను చేపడుతుంది.
ఆక్వా రైతులకు అండ
► రొయ్యలు, చేపల పెంపకం (ఆక్వా) రైతులకు నాణ్యమైన ఫీడ్ (మేత) అందేలా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్–2020కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమలుకు వీలుగా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది.
► రాష్ట్రంలో 1.09 లక్షల హెక్టార్లలో రొయ్యలు, 75 వేల హెక్టార్లలో మంచి నీటి చేపల పెంపకాన్ని రైతులు చేపడుతున్నారు. ఆక్వా సాగులో 60 శాతం ఫీడ్ కోసం రైతులు ఖర్చు చేస్తున్నారు. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన ఫీడ్ వ్యాపారం జరుగుతోంది.
► ఫీడ్ తయారీదారులు సరైన ప్రమాణాలు పాటించక పోవడం వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ ఫీడ్‌ల బెడద నుంచి విముక్తి కల్పించడం.. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఫీడ్ నాణ్యతను పరిశీలించడానికి ప్రభుత్వం ఇప్పటికే 40 ప్రాంతాల్లో ప్రత్యేక లేబొరేటరీలను ఏర్పాటు చేసింది.
25 ఏళ్లకు సోలార్ పీపీఏ
► రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పది వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంది. తక్కువ ఖర్చుకు కరెంటు వచ్చేలా, ప్రభుత్వంపై వీలైనంతగా ఆర్థిక భారం తగ్గేలా ఒప్పందానికి ఆమోదం తెలిపింది. 25 ఏళ్లకు పీపీఏ కుదుర్చుకోవాలని (ఇది వరకు 15 ఏళ్లకు ఉండింది) నిర్ణయించింది.
► పది వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్–2006 (కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) సవరణకు ఆమోదం తెలిపింది. ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది.
► సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రంగంలో మరింత మంది పెట్టుబడి దారులను ఆకర్షించాలని నిర్ణయించింది. రాష్ట్రం వెలుపల సంప్రదాయేతర విద్యుత్ ఎగుమతికి వీలుగా ప్రత్యేకంగా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రెన్యుబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీ–2020కి ఆమోదం తెలిపింది.
జిల్లాల పెంపు ఎందుకంటే
భౌగోళిక విస్తీర్ణ పరంగా జిల్లాలు పెద్దవిగా ఉండటం, జనాభా అధికంగా ఉండటం వల్ల ప్రజలకు వేగంగా సేవలు అందించడంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసి.. వేగంగా సేవలు అందించడం కోసం విప్లవాత్మక నిర్ణయంతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా పునర్ వ్యవస్థీకరించడం ద్వారా పాలన సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు త్వరితగతిన అమలవుతాయి. మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ప్రజలకు సౌకర్యంగా ఉండటం, ఖర్చును నియంత్రించడం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారు.
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
► వేగంగా ఇసుక సరఫరా కోసం ప్రత్యేకంగా శాండ్ కార్పొరేషన్
► ఆక్వా రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్–2020 అమలు
► వైద్య ఆరోగ్య శాఖలో 9,712 పోస్టుల భర్తీకి అనుమతి.. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 420 టీచింగ్, 178 నాన్ టీచింగ్ పోస్టులు
► సీపీఎస్ రద్దు ఉద్యమంలో టీచర్లు, ఇతర ఉద్యోగులపై పెట్టిన కేసుల ఉపసంహరణ
► కర్నూలు జిల్లా ప్యాపిలి, అనంతపురం జిల్లాలో గొర్రెల పెంపకందార్ల శిక్షణ కేంద్రాలు..
Comments
Please login to add a commentAdd a comment