
గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్యకళాశాలలకు ఒక్కసారిగా 460 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి.
సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్యకళాశాలలకు ఒక్కసారిగా 460 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో అదనపు సీట్లు రావడం ఇదే తొలిసారని, ఈ సీట్లన్నీ ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్ నుంచే అమల్లోకి వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో అనంతపురం వైద్యకళాశాలలో 50 సీట్లు, శ్రీకాకుళం రిమ్స్‌లో 50 సీట్లు పెరిగాయి. మిగతా 360 సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద మంజూరయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం ప్రభుత్వ సీట్లు 1,900 ఉండగా, అనంత, శ్రీకాకుళం సీట్లతో కలిపి 2 వేలకు చేరాయి.
ఇక ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం 11 వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య 2,360కి చేరింది. పద్మావతి మహిళా వైద్యకళాశాలలో 150 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే వైద్య విద్య ఖరీదైనదని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా 460 సీట్లు రావడంతో వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి తొలి విడత కౌన్సిలింగ్ పూర్తయి రెండో కౌన్సిలింగ్ మొదలు కాబోతోంది. కానీ ఇప్పటివరకూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సీట్ల భర్తీ జరగలేదు. ఈ వ్యవహారంపై కొంత సందిగ్ధత నెలకొని ఉండడంతో న్యాయ సలహాకు పంపించామని, నేడో రేపో స్పష్టత వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.