సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను తగ్గించడంతోపాటు కరోనా సమయంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి ప్రాధికార సంస్థ (డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసింది. నాణ్యమైన సీడ్,ఫీడ్ అందించడంతో పాటు విక్రయాల్లో రైతులు నష్టపోకుండా చూడటం అథారిటీ ప్రధాన లక్ష్యం రైతులు, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తూ వారి ప్రయోజనాలను అథారిటీ పరిరక్షిస్తుంది. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారుల దోపిడీ నుంచి రైతుల్ని కాపాడే రక్షణ కవచంలా నిలుస్తుంది. ఆక్వా రంగం అభివృద్ధికి రైతులు, వ్యాపారులతో సామరస్య పూర్వకంగానే వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పరిధి దాటిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అథారిటీ ఏమాత్రం వెనుకాడదు. ఈ మేరకు మత్స్య, పశు సంవర్థ్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో ప్రాధికార సంస్థ ఏర్పాటై విస్తారమైన కోస్తా తీరాన్ని అభివృద్ధికి ఆలవాలంగా, ఉపాధికి నెలవుగా తీర్చిదిద్దనుంది. గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే ఆక్వా అసిస్టెంట్లు సాగుదారులకు అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తుండగా రైతు భరోసా కేంద్రాల ద్వారా సీడ్, ఫీడ్, సాంకేతిక సలహాలను కూడా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సమస్యలను పరిష్కరించే ‘అథారిటీ’..
పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్ రూ.3.86 నుంచి ఏకంగా రూ.1.50కి తగ్గించిన ముఖ్యమంత్రి జగన్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. మత్స్యకార భరోసా, మరపడవల నిర్వాహకులకు డీజిల్ రాయితీ, చేపల వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు లాంటి పలు కార్యక్రమాలను తొలి ఏడాదిలోనే పూర్తి చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఆక్వా వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేశారు. గత ప్రభుత్వాలేవీ ఆక్వా వ్యాపారుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ధైర్యం చేయకపోవడంతో విపత్తులోనూ అదే రీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆక్వా రైతులు ఈ అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తేవడంతో రొయ్యలకు ధరలను నిర్ణయించి అధికారుల పర్యవేక్షణలో తక్షణమే కొనుగోళ్లు జరిగేలా చేశారు. వ్యాపారులు, ఎగుమతిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారి సమస్యలనూ పరిష్కరించి విదేశాలకు ఆక్వా ఎగుమతులు జరిగేలా చర్యలు చేపట్టారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్ధ లేకపోవడంతో సీఎం జగన్ పలుదఫాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా చర్చలు జరిపారు. ఆక్వా రంగం ఇంకా అసంఘటితంగా ఉన్నందున సమస్యలు తలెత్తినట్లు గుర్తించి చట్టం తేవాలని నిర్ణయించారు. ఈ రంగానికి చెందిన వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుని బిల్లు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు, మంత్రి మోపిదేవి తీర ప్రాంతాల జిల్లాల్లో పర్యటించి అన్ని రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. వ్యాపారుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది.
సీడ్, ఫీడ్‌పై నియంత్రణ లేకపోవడంతో..
► రాష్ట్రంలో మత్స్యసాగుకు అనువైన వనరులు సమృద్ధిగా ఉన్నా వ్యవస్థీకృత విధానాలు లేకపోవడంతో ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆక్వా సాగులో కీలకమైన సీడ్, ఫీడ్ నాణ్యతపై ప్రభుత్వ నియంత్రణ లోపించింది. మంచి రేటు వచ్చే వరకు రైతులు కోల్డ్‌స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలు లేవు.
► చేపలకు పెద్దగా విదేశీ ఎగుమతులు లేకపోవడంతో పూర్తిగా ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కరోనా విపత్తుతో ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు పూర్తిగా మూతపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ పరిస్థితిని నివారించి రాష్ట్రంలో చేపల వినియోగం, మార్కెట్ల విస్తరణకు చర్యలు చేపట్టడం అవసరం.
► రొయ్యల సాగుపై సరైన నియంత్రణ లేనందున నాణ్యతా లోపంతో విదేశీ ఎగుమతులు తరచూ తిరస్కరణకు గురవుతున్నాయి. సరైన ధర కూడా లభించడం లేదు.
► ఇవన్నీ పరిశీలించిన అనంతరం ఆక్వా సాగు, అనుబంధ రంగాల్లో సుíస్థిరత సాధించేందుకు ఒక చట్టం అవసరమని ప్రభుత్వం భావించింది.
అథారిటీ విధులు ఇవీ
► రాష్ట్రంలో 2019–20లో 41.75 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి జరిగింది. 26.50 లక్షల మందికి ఈ రంగం ద్వారా ఉపాధి లభిస్తోంది. శాస్త్రీయ విధానాల ద్వారా దిగుబడిని మరింత పెంచేందుకు చట్టం అవకాశాలను కల్పిస్తుంది.
► ఈ చట్టం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ ఇతర ఇన్‌పుట్స్ సకాలంలో సరసమైన ధరలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందనుంది.
► విపత్కర పరిస్ధితుల్లోనూ రైతులు నష్టపోకుండా ఆక్వా ఉత్పత్తుల నిల్వకు మౌలిక సదుపాయాలు కల్పించడం, కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవడం. ఆక్వా రైతులు, అనుబంధ పరిశ్రమలకు సులభంగా లైసెన్సులు మంజూరు.
► ఆక్వా ల్యాబ్‌ల ద్వారా సీడ్, ఫీడ్ నాణ్యతా పరీక్షలు చేపట్టి వ్యాధి నివారణ చర్యలపై రైతులకు సూచనలు చేస్తుంది. సాగులో మంచి యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా విదేశీ ఎగుమతులు, ఇతర రాష్ట్రాలకు మత్స్య సంపద చేరవేసేలా చర్యలు. ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం.
అథారిటీ అధికారాలు
► రాష్ట్రంలో చేపల పెంపకం సామర్ధ్యం, సమస్యలు తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించడం
► ఆక్వా సాగుకు సంబంధించి అన్ని అంశాలపై చట్టాలు తయారు చేయడం, నియమ నిబంధనలు, విధి విధానాలు రూపొందించి అమలు చేయడం. జిల్లా, డివిజన్, ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం
► ప్రాధికార సంస్ధ విధుల నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు పొందడం
► లాబ్‌ల అనుసంధాన వ్యవస్థ, ఆక్వా టెక్నీషియన్లు, సంస్థలను ఏర్పాటు చేయడం
► దాణా, చేపలు, రొయ్య పిల్లలపై నాణ్యతా ప్రమాణాలను పాటించడం కోసం వ్యాపార సంస్ధలు, హేచరీస్‌ల్లో తనిఖీలు, ఆడిట్‌లు చేయడం. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించిన సంస్ధలపై పెనాల్టీలు విధించడం.
► అనధికారిక చేపల పెంపకం, ప్రాసెసింగ్, పంపిణీ, అమ్మకం యూనిట్లను క్రమబద్ధీకరించడం
► వ్యవసాయ ఉత్పాదక భూములను చేపల పెంపకం చెరువులుగా మార్పిడి చేయడాన్ని నియంత్రించడం
► స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరిపి చేపలు, సముద్ర ఉత్పత్తులకు రేటు నిర్ణయించడం
► శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్థికి చర్యలు తీసుకోవడం
► సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి రైతులకు అందించడం.
► చేపపిల్లలు, దాణా, ఆక్వా ఉత్పత్తులు, ఔషధాలు, ఇతర సేవలపై చార్జీలను విధించి వసూలు చేయడం
► విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేపట్టడటం.
విపత్తులోనూ విదేశాలకు విక్రయాలు
కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుంచి ఆక్వా సాగుదారులను ఆదుకునేందుకు విదేశాలకు రొయ్యలు ఎగుమతి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విదేశీ ఎగుమతులకు సానుకూల పరిస్థితులు కల్పించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 8 జిల్లాల్లో 74,101 మెట్రిక్ టన్నులకుపైగా రొయ్యలను సేకరించగా విదేశాలకు 70,578 టన్నులు ఎగుమతి అయ్యాయి. విపత్తుకు ముందు సేకరించిన 96,536 టన్నులు విదేశాలకు ఎగుమతి చేసేందుకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లలో సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ వాటా 36.11 శాతంగా ఉంది. ఏటా ఈ వృద్ధి రేటు పెరుగుతూనే ఉంది. 2019–20లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రాష్ట్రానికి రూ.17,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది.
సేవలన్నీ ఒకే చట్రంలోకి..
► రాష్ట్రంలో 30 శాతం మత్స్య ఉత్పత్తుల వినియోగం జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం. మంచి పోషక పదార్ధాలు కలిగిన ఆక్వా ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం.
► సరళీకృత విధానాలను అనుసరిస్తూ ఆక్వా రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం. ఆక్వా అభివృద్ధికి అవసరమైన అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రైతులు, అనుబంధ సంస్ధలకు మేలైన సేవలు అందించడం. ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటెలిజెన్స్ సేవలు అందించడం.
► జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో సాంకేతిక విజ్ఞానం బదిలీని ప్రోత్సహించడం.
రైతులకు అండగా ఆక్వా అసిస్టెంట్లు
ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న721 మంది మత్స్యశాఖ సహాయకులు (ఆక్వా అసిస్టెంట్లు) ఆక్వా రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రానున్న రోజుల్లో ఆక్వా రైతులకు సీడ్, ఫీడ్, ఇతర సాంకేతిక సలహాలను కూడా అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 794 ఆక్వా అసిస్టెంట్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయగా 721 పోస్టులు భర్తీ అయ్యాయి. వీరంతా ప్రస్తుతం సచివాలయాల్లో అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు.
ఆక్వా రంగం బలోపేతానికే చట్టం
ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడానికే చట్టాన్ని తెచ్చాం. మాది స్నేహపూర్వక ప్రభుత్వం.అయితే రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో వెనుకాడం. ఆక్వా అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు రానున్న రోజుల్లో మంచి ఫలితాలనిస్తాయి. చట్టం పరిధిలోకి సముద్ర ఉత్పత్తుల వేటను కొనసాగించే మరపడవల నిర్వాహకులను కూడా చేర్చాం. ఫిష్‌ల్యాండ్ సెంటర్లు, హార్బర్ల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నాం. మత్స్యకారుల అభ్యున్నతికి పలు పథకాలు అందుబాటులోకి తెచ్చాం. – మోపిదేవి వెంకట రమణారావు (మత్స్య శాఖ మంత్రి)
అన్ని వర్గాలకు ఉపయోగం...
విపత్తుల సమయంలో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అధికారులు నిర్ణయించిన రేటుకు ఎగుమతిదారులు పంటను కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోకుండా ఉంటారు. ఎగుమతిదారులు, హేచరీస్, కోల్డు స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకుల సమస్యల పరిష్కారం, అభివృద్దికి చర్యలు తీసుకునేలా చట్టంలో విధివిధానాలున్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో నాణ్యమైన రొయ్యల్ని ఎగుమతి చేసి విదేశీ మారకద్రవ్యం ఆర్జించడానికి అవకాశం ఏర్పడుతుంది. – మోహన్‌రాజు (రొయ్య రైతుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు)
రెండు వారాల్లో విధివిధానాలు...
ఆక్వా చట్టంపై రెండు వారాల్లో విధి విధానాలు రూపొందిస్తాం. బిల్లు తయారు చేసే సమయంలో అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. సాగుకు సంబంధించిన అన్నివర్గాలకు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాం. సీడ్, ఫీడ్‌లో నాణ్యత పాటించని సంస్ధలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాగు లైసెన్సులను రెండు వారాల్లోనే మంజూరు చేస్తాం. విపత్తుల సమయంలో రైతులు నష్టపోకుండా ఆక్వా వ్యాపారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు జరిపి రేటు నిర్ణయిస్తాం. ప్రభుత్వం సీడ్, ఫీడ్‌ను అభివృద్ది చేసి రైతులకు సరఫరా చేస్తుంది. – కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment