పాడికి తోడేదీ?
* ఆంధ్రప్రదేశ్‌లో డెయిరీ పరిశ్రమను దెబ్బతీస్తున్న అధికార పార్టీ
* ప్రభుత్వ డెయిరీలకు ప్రోత్సాహకాలివ్వకుండా ఎగనామం.. సొంత డెయిరీలపైనే దృష్టి
* తెలంగాణ, కర్ణాటకల్లో ప్రభుత్వ దన్ను
* రూ. 4 ప్రోత్సాహం ప్రకటించిన తెలంగాణ
* రాష్ట్ర రైతులను పట్టించుకోని ఏపీ సర్కారు
సాక్షి, హైదరాబాద్: అదే తీరు. నాడూ... నేడూ... ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వానిది అదే వైఖరి. తమ చేతిలోని ప్రైవేటు సంస్థల కోసం ప్రభుత్వ సంస్థల్ని బొందపెట్టడం. అయితే వాటికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం... లేదంటే తమ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించటం. చక్కెర కర్మాగారాల్ని పప్పుబెల్లాల్లా అమ్మేసినా... నూలు మిల్లుల్ని రియల్టీ భూముల కోసం నలిపేసినా... డెయిరీల్ని దారుణంగా చిదిమేసినా... అన్నిటా అదే మార్కు. ఇన్నాళ్ల తరవాత మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు మళ్లీ ఇపుడు అదే మార్కును కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తోంది. మెల్లగా ప్రభుత్వ డెయిరీ పరిశ్రమను చిదిమేసేలా వ్యవహరిస్తోంది. కావాలంటే మీరే చూడండి...
రాష్ట్రంలో 50 లక్షల మందికి జీవనాధారంగా ఉన్న పాడి పరిశ్రమకు ప్రోత్సాహమే లేదు. వ్యవసాయం తరవాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగంగా పాడి పరిశ్రమకున్న ప్రాధాన్యం దృష్ట్యా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా... తమ చేతిలోని ప్రైవేటు సంస్థల కోసం టీడీపీ ప్రభుత్వం మాత్రం సాచివేత ధోరణినే కొనసాగిస్తోంది. ప్రభుత్వ డెయిరీలకు పాలు విక్రయిస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ.4 ఇస్తామని చెబుతూ... పాల సేకరణ ధరను లీటరుకు రూ.4 మేర పెంచుతూ ఇటీవలే తెలంగాణ సర్కారు జీవో కూడా జారీ చేసింది. తెలంగాణ కన్నా దాదాపు 5 రెట్ల మంది ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్నా... ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ స్పందించలేదు.
కారణం... ఏపీ గనక ప్రభుత్వ డెయిరీల పాల సేకరణ ధర పెంచితే రైతులంతా ప్రభుత్వ రంగంలోని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీడీడీసీఎల్) సారథ్యంలోని డెయిరీలకే పాలు పోస్తారు. అపుడు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ వంటి ప్రయివేటు డెయిరీలు కూడా పోటీ తట్టుకోవటానికి తప్పనిసరిగా పాల సేకరణ ధర పెంచాలి. అలా పెంచితే వాటికొచ్చే లాభాలు తగ్గుతాయి. అందుకే ప్రభుత్వ డెయిరీల పాల సేకరణ ధర పెంచకుండా... రైతులు తమను మాత్రమే ఆశ్రయించేలా చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు. అదీ కథ.
రాష్ట్రంలో సుమారు 90 లక్షల గేదెలు, 18 లక్షలకు పైగా సంకర జాతి ఆవులు, 55 లక్షల దేశవాళీ ఆవులున్నాయి. తీవ్రంగా పెరుగుతున్న పశుగ్రాసం ధర, నీటి కొరత, తవుడు, చెక్కల ధర వంటివి పాడి రైతుల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. రోజుకు సగటున దాదాపుగా 50 లక్షల లీటర్లు ఉత్పత్తి అవుతుండగా, అందులో ఏపీ డెయిరీ సేకరిస్తున్నది కేవలం 1.70 లక్షల లీటర్లు. మిగిలినదంతా ప్రయివేటు డెయిరీల చేతుల్లోకే వెళుతోంది. కారణం ఒక్కటే. సేకరణ ధర. ఉదాహరణకు హోల్ మిల్క్‌ను ఏపీ డెయిరీ రూ.55.50 ఇచ్చి సేకరిస్తుండగా ప్రయివేటు డెయిరీలు రూ.57 ఇచ్చి సేకరిస్తున్నాయి.
సహజంగానే ప్రయివేటు డెయిరీల ధర ఎక్కువగా ఉంటోంది కనక రైతులు వాటినే ఆశ్రయిస్తున్నారు. నిజానికి సేకరణ ధర పెంచాల్సింది ప్రభుత్వమే. అయితే ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ప్రధాన ప్రయివేటు డెయిరీలుండటంతో వారు చాకచక్యంగా వ్యవహరిస్తూ తమ నేతృత్వంలోని ప్రయివేటు డెయిరీల సేకరణ ధరే కాస్త ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. ఒకరకంగా ప్రభుత్వ డెయిరీల వంక ఏ రైతూ వెళ్లకుండా చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ప్రభుత్వ డెయిరీలు కునారిల్లటమే కాదు. రైతులకూ గిట్టుబాటు ధర రావటం లేదు. రాష్ట్రంలో అత్యధిక శాతం పాలను సేకరిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కావటం ఇక్కడ గమనార్హం కూడా. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను ప్రభుత్వ సహకార డెయిరీ కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే పాలను సేకరిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం.
రూ.4 ప్రోత్సాహకంగా ప్రకటించిన తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం లీటరు పాలకు అదనంగా రూ.4ను ప్రోత్సాహకం ప్రకటించాక ప్రభుత్వ సమాఖ్య ద్వారా పాల ఉత్పత్తి పెరిగింది. గత పదిరోజుల్లోనే రోజుకు అదనంగా 40 వేల లీటర్ల పాల సేకరణ జరగటం విశేషం. పాల సేకరణలో లీటరుకు 4 రూపాయలు పెరగడంతో ప్రభుత్వ డెయిరీకి పాలు ఇవ్వడానికి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా ప్రభుత్వ పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలను ప్రకటించి అమలు చేస్తోంది.
ఏపీ రైతులకు ఎందుకివ్వరు?
ఆంధ్రప్రదేశ్ పాడి రైతులు ఎప్పట్నుంచో ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ, పొరుగునున్న కర్ణాటక ప్రభుత్వాలు పాడి రైతుల్ని ప్రోత్సహిస్తుండగా.. ఎంతో ఆర్భాటంగా వ్యవసాయ మిషన్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు సమీప ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తా, రాయలసీమలో వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు.
ఏపీ డెయిరీ మరింతగా విస్తరించాలంటే ప్రభుత్వ చేయూత లేకుండా సాధ్యం కాదు. తెలంగాణ, కర్ణాటక మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటిస్తే అటు ప్రైవేటు డెయిరీల ఆట కట్టించడంతో పాటు రైతులకూ ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటు డెయిరీల ఆధిపత్యానికి ముకుతాడు వేయాలంటే మరో ప్రత్యామ్నాయం లేదని వారు చెబుతున్నారు.
ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం..
ఏపీ డెయిరీ క్రమేణా నిర్వీర్యమవుతుండటం, సహకార రంగంలోని ఒకటి రెండు సంస్థలు మినహా మిగతావి దివాళా తీయడంతో ప్రస్తుతం ప్రైవేటు డెయిరీలే పాల ఉత్పత్తిదారుల భవిష్యత్తును శాసిస్తున్నాయి. పాల సేకరణ ధర పెంచాలన్నా, తగ్గించాలన్నా ఈ సంస్థలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందులోనూ ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలకు, వారి బంధువులకు సొంత డెయిరీలు ఉండడంతో పాల సేకరణ ధర పెంచేందుకు పాలకులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. అన్నిటా తెలంగాణ కంటే తమదే అగ్రస్థానం అనే చంద్రబాబు పాల రైతులకు బోనస్ విషయంలో వెనుకాడటానికి ఇదే కారణమని రైతు సంఘాల నేతలంటున్నారు. కర్ణాటకలో మాదిరి ప్రైవేటు డెయిరీల ఆటకట్టించి, ప్రభుత్వ రంగ సంస్థను పటిష్టం చేయాలని టీడీపీ ప్రభుత్వం అనుకుంటే తక్షణమే రైతులకు బోనస్ ప్రకటించేదని పాడి పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు చెబుతున్నారు.
హెరిటేజ్ కోసం రైతుల్ని బలిచేయొద్దు
తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాలరైతులకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించాలి. చంద్రబాబు గతంలో మాదిరి కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వ రంగంలోని ఏపీడీడీసీఎల్‌ను, ఇతర సహకార సంస్థలను బతికించేలా చూడాలి. తన హెరిటేజ్ కోసం పాడి రైతుల్ని బలిపెట్టడం తగదు. ప్రైవేటు సంస్థల ఆగడాలు అరికట్టేలా, రైతు శ్రేయస్సును పట్టించుకునేలా ముఖ్యమంత్రి వ్యవహరించాలి. రూ.4 నగదు ప్రోత్సాహం అవసరం. అనివార్యం.
- కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
ప్రైవేటు డెయిరీల ఒత్తిడే కారణం
ఏపీ ప్రభుత్వం పాల రైతును విస్మరిస్తోంది. సేకరణ ధర పెంచేందుకు వెనుకాడుతోంది. ప్రైవేటు డెయిరీల ఒత్తిడే దీనికి కారణం. లాభం వచ్చే పని ఏదైనా చేస్తామనేది రిలయెన్స్ నినాదం. ప్రస్తుతం హెరిటేజ్ విధానం కూడా అలాగే ఉంది. దీన్ని ప్రజలు తిరస్కరించాలి. పాల సేకరణ ధరలో రాజకీయ జోక్యాన్ని నివారించి సహకార రంగం బలపడేలా చూడాలి. ప్రభుత్వం మిగతా పంటలకు ఇచ్చినట్టే పాలకూ గిట్టుబాటు ధర కల్పించాలి.
- నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం నేత