ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుదల అమలులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం తెలిసిందే.
పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుదల అమలులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం తెలిసిందే. ఇందుకు సంబంధించి అసెంబ్లీ ఆమోదించిన చట్టసవరణ బిల్లుకు గవర్నర్ నరసింహన్ శనివారం ఆమోదం తెలిపారు. తెలంగాణలో పనిచేస్తూ సోమవారం పదవీ విరమణ చేసే ఆంధ్రా ఉద్యోగులు కొంతకాలం ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
కమలనాథన్ కమిటీ శాశ్వత ఉద్యోగుల పంపిణీ పూర్తి అయిన తరువాత తెలంగాణలో విరమణ చేసిన ఆంధ్రా ఉద్యోగులను సర్వీసు బ్రేక్ లేకుండా ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది. వారు 60 ఏళ్లు వచ్చేవరకు ఏపీలో పనిచేస్తారు. ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగుల కేటాయింపులో భాగంగా తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేస్తూ ఈ నెలాఖరుకు పదవీ విరమణ కావాల్సి ఉన్నా రిటైర్ కారు. కమలనాథన్ కమిటీ శాశ్వత కేటాయింపు పూర్తయ్యేవరకు వారు ఆంధ్రాలో పనిచేస్తారు. శాశ్వత కేటాయింపులో ఆంధ్రాలో పనిచేస్తూ తెలంగాణకు వస్తే అప్పుడు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.