సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణలో దేశానికే ఆంధ్రప్రదేశ్ రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. కేసులు ఎన్ని వస్తున్నాయన్నది కాకుండా, వైరస్‌ను కట్టడి చేయడమే ముఖ్యమని ఏపీ తొలి నుంచి భావించింది. ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా ఇన్ఫెక్షన్‌కు గురైన ఎక్కువమందిని గుర్తించి వారికి చికిత్స అందించడమే కాకుండా, వారి నుంచి ఇతరులకు సోకకుండా చేయవచ్చునని మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానాన్ని అనుసరిస్తోంది. ఇది సత్ఫలితాలనిస్తుండటంతో కరోనా నియంత్రణలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పుడు ఏపీ విధానమే దేశవ్యాప్తంగా అనుసరణీయం అవుతోంది. మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన ఆదేశాల బట్టి అదే అర్థమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు ట్రూనాట్ మెషిన్లు వాడాలని, టెలిమెడిసిన్‌ను విరివిగా అందుబాటులోకి తేవాలని కేంద్రం ఆదేశించింది. ఈ విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలినాళ్లలోనే అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ముందస్తుగానే గుర్తించిన ఏపీ
► దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయని సమయంలో ట్రూనాట్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుంది.
► ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 257 ట్రూనాట్ మెషిన్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
► ట్రూనాట్ మెషిన్ ద్వారా చేసిన పరీక్షల ఫలితాలు వైరాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల ఫలితాలకు సమానంగా ఉంటాయని ఐసీఎంఆర్ చెప్పింది.
► ఏపీ తర్వాత ఒకట్రెండు రాష్ట్రాలు మాత్రమే ట్రూనాట్ మెషిన్లను వినియోగిస్తున్నాయి.
► దేశంలోనే మొట్టమొదట టెలిమెడిసిన్ వ్యవస్థను రూపొందించింది ఏపీలోనే.
► రాష్ట్రంలో 14410 నంబర్‌ను ఏర్పాటు చేసి ఫోన్ చేస్తే చాలు వైద్య సలహాలు, సూచనలు ఇస్తున్న విషయం తెలిసిందే.
► అంతేకాదు ఏఎన్‌ఎంల ద్వారా అవసరమైన మందులు ఇంటికే పంపుతున్నారు.
► 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు.
► ఉచితంగా 108 అంబులెన్సు సర్వీసులను తెచ్చారు.
► అపర సంజీవనిగా చెప్పుకొనే ఆరోగ్యశ్రీ, సంచార వైద్యశాలలైన 104 వాహనాలు కూడా ఆయన హయాంలో తెచ్చినవే.
కరోనా నియంత్రణకు కార్యాచరణ
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి
వారు బయటకు రాకుండా చూడటం
ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల సేవలు విస్తృతంగా వినియోగం
కరోనా నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ కొత్త కార్యాచరణతో ముందుకెళుతోంది. ఇప్పటివరకూ ఇన్ఫెక్షన్ సోకిన వారిని గుర్తించి, వారిని ఆస్పత్రికి తరలించడం, ఇతరులకు వ్యాప్తి చెందకుండా చూడటం జరుగుతోంది. కానీ ఇప్పుడు కరోనా ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందో వారిని జాగ్రత్తగా చూసుకుంటే చాలని, ఒక వేళ కొన్ని గ్రూపులకు కరోనా సోకినా త్వరగా కోలుకుని వారు కోవిడ్ వారియర్స్ (కోవిడ్ వ్యతిరేక సైన్యం)గా పనిచేస్తారని భావిస్తున్నారు. ‘భయపడాల్సిన పనిలేదు..జాగ్రత్తగా ఉంటే చాలు’ అన్న నినాదాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన కేన్సర్, మధుమేహం, గుండెజబ్బులు వంటి వాటితో బాధపడుతున్న వారిని, 60 ఏళ్ల పైబడినవారిని గుర్తించడం, వారిని నిత్యం పర్యవేక్షించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. వీరిని కాపాడుకుంటే మిగతా వారిని కరోనా వైరస్ ఏమీ చేయలేదని, దీంతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లక్ష్యాలు ఇవీ..
► కరోనా వైరస్‌తో ఒక్కరు కూడా మృతి చెందకూడదు. మరణాల నియంత్రణకు నెలాఖరుకు 9వేల ఐసీయూ పడకలు సిద్ధం.
► యువకులు, నడివయస్కులకు వైరస్ సోకినా వారం రోజుల్లోనే కోలుకుంటారు.
► వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కాపాడుకుంటే సరిపోతుంది.
► దీనికోసం ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, పీహెచ్‌సీ వైద్యుల సేవలు విస్తృతంగా ఉపయోగించుకోవాలి.
► యథావిధిగా కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కంటైన్మెంట్ చేయడం.
నియంత్రణ ఇలా..
► దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది ఉంటారని అంచనా.
► వీరితో పాటు 60 ఏళ్లు దాటిన వారిని గుర్తించి, వారికి కావాల్సిన మందులు ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడం, వారిని ఇంట్లోనుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం.
► ప్రతిరోజూ ఆశా కార్యకర్త లేదా, ఏఎన్‌ఎం వారి ఇంటికి వెళ్లి పర్యవేక్షించడం. వాళ్ల ఆరోగ్యవివరాలు ఎప్పటికప్పుడు పీహెచ్‌సీ డాక్టరుకు నివేదించడం.
► అవసరం అనుకుంటే పీహెచ్‌సీ డాక్టర్ వచ్చి వైద్య సూచనలు చేయడం.
► ఇలాంటి వాళ్లు రెడ్‌జోన్‌లో ఉంటే అవసరమైతే ప్రత్యేక క్వారంటైన్‌కు తీసుకెళ్లి ఉంచడం.
► కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యం అందించడం.
వారిని కరోనా ఏమీ చేయలేదు
సాధారణ వ్యక్తులను కరోనా వైరస్ ఏమీ చేయలేదు. దీనికి భయపడాల్సిన పనిలేదు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కాపాడాలి. దీనివల్ల మరణాలను తగ్గించే అవకాశం ఉంటుంది. కరోనా వల్ల ఒక్కరు కూడా మరణించకూడదనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం.
–భాస్కర్ కాటమనేని, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ
Comments
Please login to add a commentAdd a comment