నెల్లూరు (సెంట్రల్) : ఎటువంటి ఆధారాలు లేకుండా మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాపై బురద చల్లే ఆలోచనలతో చేసిన విమర్శలపై సీబీఐ...
నెల్లూరు (సెంట్రల్) : ఎటువంటి ఆధారాలు లేకుండా మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాపై బురద చల్లే ఆలోచనలతో చేసిన విమర్శలపై సీబీఐ, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా ఇంకేదైనా దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం లేఖ రాశారు.
లేఖ సారాంశం..‘ఇటీవల మీ పార్టీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నాపై ఆరోపణలు చేశారు. నేను అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డానని, కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎండీతో కలిసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని నాపై ఆరోపణలు చేశారు. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మరణించిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మీకందరికి తెలుసు. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాపైన, మొత్తం నా కుటుంబం పైనా కూడా విచారణ జరిపించండి.
పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గతంలో హైదరాబాద్‌లోని నాచారంలో వెల్డింగ్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తుండేవారు. ఇతను ఉమ్మడి రాష్ట్రంలో చాలా జిల్లాలో అనేక మనీ స్కీంలు కార్యాలయాలు తెరచి అవినీతి, మోసాలు, అక్రమాలకు పాల్పడి ప్రజలను మోసం చేశారనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఇతనిపై చాలా జిల్లాల్లో కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి.
ఇప్పటికీ కూడా కొన్ని కోర్టుల్లో ఇతనిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. అదే విధంగా ఘట్‌కేసరి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడనే ప్రచారం కూడా ఉంది. మీ పార్టీకి సంబంధించినకోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నాచారంలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నప్పుటి నుంచి ఇప్పటి వరకు అతనిపై కూడా విచారణ జరిపించండి.’
నేను కోరిన ప్రకారం నాపై ఏ సంస్థతోనైనా విచారణ జరిపించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా మీ ఎమ్మెల్యేపై కూడా అదే సంస్థతో విచారణ చేయించండి. రాష్ట్రంలో మీ ప్రభుత్వం, కేంద్రంలో మీ మిత్రపక్షమైన ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ విచారణలో నాపై ఏదైనా అవినీతి నిరూపించబడితే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధమని చంద్రబాబుకు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణకు రాసిన లేఖలో ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.