ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 31న జరిగే కాన్వొకేషన్ నిర్వహణకు అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు అందరి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిని ఆహ్వానించడం, వేదిక మార్పు, కళాప్రపూర్ణల ఎంపిక ప్రక్రియ.. ఇలా ప్రతి అంశం వివాదానికి కేంద్రంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.
విశాఖ సిటీ : ఆంధ్రవిశ్వవిద్యాలయానికి తొమ్మిది దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. లక్షలాది మంది విద్యార్థులకు అక్షర భిక్ష పెట్టిందీ విద్యా సంస్థ. ఇంతటి విశిష్ట విశ్వవిద్యాలయంలో పాలకులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వర్సిటీకి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి. ప్రధానంగా స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా ఆహ్వానించే వ్యక్తి ఎంతో ప్రముఖుడై ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్‌ను పాలకులు ఆహ్వానించారు. విభజన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇవ్వరాదని కేంద్రానికి చెప్పిన ఆ పెద్దమనిషికి ఏయూ ఎర్ర తివాచీ పరవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఆయనకు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేయనుండడం అందరి మనో భావాలను దెబ్బ తీయడమే. సమైక్యాంధ్ర, ప్రత్యే క హోదా ఉద్యమాలకు ఊపిరిలూదినది ఏయూ నే. అటువంటి ఉద్యమ గడ్డపై హోదావాదాన్ని పక్కన పెట్టడానికి కారణమైన వ్యక్తికి ఉన్నతాసనం వేసి గౌరవించాలనే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో తమ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికే ఏయూ పెద్దలు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నారనే గుసగుసలు వర్సిటీలో వినిపిస్తున్నాయి. దీనిని బహిరంగంగా వ్యతిరేకించడానికి పలు వర్గాలు సిద్ధమవుతున్నాయి.
వేదిక మార్పు తగదు
స్నాతకోత్సవ వేదిక మార్పు సైతం ఆక్షేపణలకు గురవుతోంది. దశాబ్దాల క్రితం నిర్మించి పదుల సంఖ్యలో స్నాతకోత్సవాలకు వేదికగా నిలచిన కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మంది రాన్ని కాదని.. బీచ్‌రోడ్డులో హంగు, ఆర్భాటానికి ప్రాధాన్యం ఇస్తూ నిర్మించిన కన్వెన్షన్ కేంద్రంలో కాన్వొకేషన్ నిర్వహించాలని వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం అందరినీ బాధించింది. దీనిపై పాలకమండలి సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, బాహాటంగానే వర్సిటీ అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు సమాచారం. స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథి, గవర్నర్, ఇతర అతిథులను తోడ్కొని వీసీ సభికుల మధ్య నుంచి వేదికను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. కన్వెన్షన్ కేంద్రంలో ఇటా జరగాలంటే మొదటి అంతస్థుకు ఎక్కాల్సిందే. మెట్ల మార్గం లో గవర్నర్ వంటి వ్యక్తిని ఎక్కి రావాలని కోరడం సమంజసం కాదు. దీనితో ఈ ప్రక్రియ నామమాత్రంగా ముగిసే అవకాశం ఉంది. వేదికకు అనుకుని ఉన్న వీవీఐపీ గది వైపు నుంచి మాత్రమే అతిథులు లోనికి ప్రవేశించే అవకాశం ఉంది.
ప్రముఖుల విస్మరణ
కళాప్రపూర్ణల ఎంపికలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా, హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులను, సాహితీవేత్తలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, జానపదానికి చిరునామాగా నిలుస్తున్న వంగపండు ప్రసాదరావులకు కళాప్రపూర్ణకు పరిశీలించక పోవడం విచారకరమని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతవరకు కేంద్రం పద్మశ్రీ ఇవ్వకపోయినా కనీసం ఆంధ్రవిశ్వవిద్యాలయమైనా గౌరవించి సముచితంగా సత్కరించి ఉండాల్సిందని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో జన్మించి తెలుగు రాష్ట్రాలలో జానపదానికి పెద్ద దిక్కుగా నిలచిన వంగపండు ప్రసాదరావు కళాప్రపూర్ణకు ఏవిధంగా అర్హులు కాదో తెలపాలని వీరు వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. విశ్రాంత ఆచా ర్యులు నలుగురైదుగురితో ముందుగానే ప్రత్యే కం కమిటీ వేసి పేర్లు పరిశీలించాల్సిందని సూ చిస్తున్నారు. ఆదరాబాదరాగా ఆరు రోజుల ముందు పాలక మండలి సమావేశం నిర్వహిం చి నలుగురి పేర్లు గవర్నర్ ఆమోదానికి పం పడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment