ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర ప్రముఖులు
ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోని ఐదు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం–వేవ్స్ 2019కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అరి్పంచారు. అనంతరం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ప్రతి విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘాలు పటిష్టం కావాల్సిన అవసరం ఉందన్నారు. తాము చదువుకుని, తమ ప్రగతికి మూలస్థంభంగా నిలిచిన వర్సిటీకి సహకారం అందించడానికి పూర్వ విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. చదువుల దేవాలయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తోందన్నారు. కలలు కనాలని, వాటిని సాధించే దిశగా పని చేయాలని సూచించారు.
ఆచార్యుల భర్తీలో జాప్యం విచారకరం..
తమ మంత్రి వర్గంలో విద్యా శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆదిమూలపు సురేష్ ఓ దళితుడని, తన ఏడో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలోకి మారి ఐఆర్‌ఎస్ అధికారిగా ఎదిగారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. అతనికి అంతటి తపన, పట్టుదల ఉండబట్టే రాణించారన్నారు. వీటిని చూసి అతనికి విద్యా శాఖ మంత్రిగా నియమించామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 459 ఆచార్యుల పోస్టులు భర్తీ కావాల్సి ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇంత కాలం నియామక ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడం విచారకరమని సీఎం అన్నారు.
వర్సిటీ ప్రతిపాదనలకు సహకారం : టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీ
విశిష్ట అతిథి టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ మాట్లాడుతూ ఏయూ నుంచి వచ్చే ప్రతిపాదనలకు పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తి నిత్యం నూతన జ్ఞానాన్ని పొందడం, ధనాన్ని సంపాదించడం, పొందిన దానికి తిరిగి ప్రతిఫలాన్ని సమాజానికి చెల్లించడం అనే లక్షణాలను కలిగి ఉండాలని సూచించారు. సాంకేతికత మనకంటే గొప్పది కాదని, సాంకేతికతను వినియోగించుకుంటూ లాభపడుతున్న మానవులే నిజమైన మేధావులని అభిప్రాయపడ్డారు. ఆరి్టఫీíÙయల్ ఇంటిలిజెన్స్ కంటే మన ఇంటిలిజెన్స్ ఎంతో గొప్పదన్నారు. భవిష్యత్తులో సాధించాల్సినవి చాలా ఉన్నాయని, దీనికి సమష్టిగా పనిచేయడం ఎంతో అవసరమని చెప్పారు. తాను ఏయూకు రాక ముందు ఒక వృద్ధ విశ్వవిద్యాలయానికి వెళుతున్నానని భావించానన్నారు. ఇక్కడ యువతలోని ఉత్సాహం, పూర్వ విద్యార్థుల సహకారం, వర్సిటీ వీసీ దార్శనికతతో కూడిన పనితనం తనను అబ్బురపరిచాయన్నారు. ఈ రోజు తనకు అత్యంత స్ఫూర్తిని నింపిన రోజుగా నిలుస్తుందని చెప్పారు.
ఉన్నత అవకాశాలకు వారధి ఆంగ్ల భాష : జీఎంఆర్
పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్దం దిశగా అడుగులు వేస్తోందన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆవిర్భావం వికాసాలను వివరించారు. విద్యను ప్రోత్సహించే ముఖ్యమంత్రిని రాష్ట్రం కలిగి ఉండడం ప్రజల అదృష్టమన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన మంచి నిర్ణయమన్నారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చి ఇంజినీరింగ్‌లో చేరిన తొలినాళ్లలో పడిన ఇబ్బందులను వివరించారు. ఉన్నత అవకాశాలకు ఆంగ్ల భాష ఒక వారధిగా నిలుస్తుందన్నారు.
ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సమర్థతను విశ్వవిద్యాలయం ఒక అలవాటుగా మార్చుకుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఇంజినీరింగ్ కళాశాల సీట్లు రెట్టింపు చేయడం సాధ్యమైందన్నారు. నాక్ గ్రేడింగ్, రూసా పథకం అమలు, ఎంహెచ్‌ఆర్‌డీ ర్యాంకుల్లో ఏయూ ముందుంటోందన్నారు. ప్రతి కుటుంబం నుంచి విద్యావంతులు రావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, దీనిని సాకారం చేసే దిశగా పని చేస్తున్నామని చెప్పారు. ఆచార్యుల పదవీ విరమణ కారణంగా తాత్కాలిక ఉద్యోగులతో వర్సిటీ నిర్వహణ కొనసాగిస్తున్నామన్నారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలతో కూడిన ఉపాధిని పొందేలా తీర్చిదిద్దుతామన్నారు. అంబేడ్కర్ చెప్పిన విధంగా ఆంగ్ల మాధ్యమం బోధనను రాష్ట్రంలో ప్రతి విద్యారి్థకి అందించే ప్రక్రియ ఆరంభం అవుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజలకు ఉన్నత విద్యను చేరువ చేశారన్నారు. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం అమలు చారిత్రాత్మకంగా నిలుస్తున్నాయన్నారు. జన హృదయ నేతగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారన్నారు.
పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ ఆచార్య బీల సత్యనారాయణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న యువతకు దిశానిర్దేశం చేయాలన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు స్థిర లక్ష్యంతో సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, గొట్టేటి మాధవి, కె.సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, చెట్టి పాల్గుణ, లవ్ అండ్ కేర్ సంస్థ నిర్వాహకులు పి.యేసుపాదం, రిజి్రస్టార్ ఆచార్య వి.కృష్ణమోహన్, కార్యదర్శి బి.మోహనవెంకటరామ్, సంయుక్త కార్యదర్శి కుమార్‌రాజ, పలువురు వీసీలు, మాజీ వీసీలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
రూ.50 కోట్ల సాయం..
విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రభుత్వ తరఫున రూ.50 కోట్ల సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. పూర్వ విద్యార్థుల సంఘం రూ.50 కోట్లు నిధులను కార్పస్ ఫండ్‌గా సమీకరించాలని, దీనికి సమానంగా రూ.50 కోట్లు ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు.
విద్యతోనే మెరుగైన జీవనం..
విద్య మెరుగైన జీవనాన్ని అందిస్తుందని తాను నమ్ముతానని, అందుకే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలను మూడు దశల్లో రూ.12 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తొమ్మిది ఆవశ్యక అంశాలను ప్రధానంగా తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తామన్నారు. ఉపాధిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరగాలని, ప్రస్తుతం ఉన్న డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులకు మరో ఏడాది పెంచి హానర్స్ డిగ్రీలు అందిస్తామన్నారు. ఒక ఏడాది కాలం విద్యార్థికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి వినియోగిస్తామన్నారు.
విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..
ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు విశాఖకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, పార్టీ నగర, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, శరగడం చిన అప్పలనాయుడు, సమన్వయకర్తలు కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, ముఖ్య నాయకులు, అధికారులు.. సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు బొత్స సత్యనారాయణ,ముత్తంశెట్టి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, సీఎం ప్రొగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం ఉన్నారు. తనను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్‌రావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాం«దీ, ముఖ్యనేతలు కుంబా రవిబాబు, కొయ్యప్రసాద్‌రెడ్డి, దాడి రత్నాకర్, వంశీరెడ్డి, రొంగల జగన్నాథం, చొక్కాకుల వెంకట్రావ్, సూర్యనారాయణరాజు, ఫరూఖీ, సనపల చంద్రమౌళి, బొడ్డేటి ప్రసాద్, రవిరెడ్డి, పక్కి దివాకర్, మంత్రి రాజశేఖర్, ప్రేమ్‌బాబు, బోని శివరామకృష్ణ, సుధాకర్, గుంటూరు నరసింహమూర్తి, మంత్రి రాజశేఖర్, సతీష్ వర్మ, శ్రీకాంత్‌రాజు, కిరణ్‌రాజు, శ్రీనివాస్‌రెడ్డి, కాంతారావు, సురేష్, భర్కత్ అలీ, తుల్లి చంద్రశేఖర్, రేయి వెంకటరమణ, శ్రీనివాస్ గౌడ్, షరీఫ్, శ్రీదేవి వర్మ, యువశ్రీ, పవన్, బాకి శ్యాంకుమార్‌రెడ్డి, ఎ.రాజుబాబు, సునీల్ పాల్గొన్నారు.
సాదర వీడ్కోలు..
విమానాశ్రయం నుంచి నేరుగా ఏయూలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరై.. అక్కడ ప్రసంగించాక ముఖ్యమంత్రి మళ్లీ విమానాశ్రయానికి సాయంత్రం 7.30 గంటలకు చేరుకుని గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. వీడ్కోలు సమయంలోనూ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు విచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment