ఏయూ క్యాంపస్ (విశాఖ) : ఏపీ సెట్ నిర్వహణ బాధ్యతను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించింది. గురువారం ఏయూలోని సెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏయూ ఇన్‌చార్జి వీసీ ఈఏ నారాయణ ఈ వివరాలు వెల్లడించారు. త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ తేదీలు, షెడ్యూలు విడుదల చేస్తామన్నారు. నెల రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, జూలై నెలాఖరులో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. యూజీసీ గత నెలలో ఏయూను సందర్శించి, వనరులు, మేథో, మౌలిక వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి మూడేళ్ల కాలానికి సెట్ నిర్వహణ బాధ్యతను మంజూరు చేసిందన్నారు.
సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 31 అంశాలలో సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. డిగ్రీ కళాశాలల అధ్యాపక ఉద్యోగాలు, యూనివర్సిటీల ఆచార్యుల నియామకాల్లో సెట్ అర్హతను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలమందికిపైగా విద్యార్థులు సెట్‌కు దరఖాస్తు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సెట్ అర్హత సాధించినవారికి నేరుగా విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రవేశం లభిస్తుందన్నారు. సమావేశంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి.రామన్, జి.ఎం.జె.రాజు, ఆచార్య పి.శ్రీనివాస్, పి.హృశికేశవరావు, పి.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సెట్ నిర్వహణ బాధ్యత ఏయూకే..
Published Thu, Apr 28 2016 7:34 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement