APSET
-
ఏపీ సెట్‌కు 80.72 శాతం హాజరు
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్–2021 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 80.72 శాతం మంది హాజరయ్యారు. పరీక్షను ఆదివారం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 78 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షకు మెత్తం 36,667 మంది దరఖాస్తు చేయగా 29,596 మంది హాజరైనట్లు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో పరీక్ష కేంద్రాలను ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు పరిశీలించారు. సోమవారం ఏపీ సెట్ వెబ్సైట్లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంచనున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. -
31న ఏపీసెట్ ప్రవేశ పరీక్ష
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఈ నెల 31న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్ 2021 నిర్వహించనున్నట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 78 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్న ఏపీసెట్‌కు 36,667 మంది దరఖాస్తు చేశారన్నారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని, గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతిస్తామన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి హాజరు కావాలని, తమ వెంట వాటర్ బాటిల్‌ను తీసుకురావచ్చన్నారు. దివ్యాంగులు ఒక రోజు ముందుగానే సహాయకుని కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. హాల్‌టికెట్లు ఏపీసెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
APSET 2021: అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యేలా..
ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టుల నియామకాలకు అర్హత పరీక్షగా పేర్కొనే.. ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్)’కు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఇటీవల ఏపీసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణతోపాటు ప్రిపరేషన్ టిప్స్... యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా చేరాలనుకునే అభ్యర్థు లకు తగిన అకడమిక్ అర్హతలతోపాటు, ఆయా సబ్జెక్టుల్లో లోతైన పరిజ్ఞానం ఉండాలి. అలాంటి అభ్యర్థుల ప్రతిభను, సబ్జెక్టు నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించిందే ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్). ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తారు. అర్హతలు ► యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం/కాలేజీ నుంచి కనీసం 55శాతం మార్కు లతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ► ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(నాన్ క్రిమీలేయర్)/పీడబ్ల్యూ డీ/ట్రాన్స్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► 1991 సెప్టెంబరు 19 నాటికి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పీహెచ్డీ అభ్యర్థులు(అన్ని కేటగిరీల అభ్యర్థులు) పీజీలో కనీసం 50శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► అభ్యర్థులు తాము చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్టు సెట్ జాబితాలో లేకుంటే.. ఏదైనా ఇతర సంబంధిత సబ్జెక్టును ఎంచుకోవచ్చు. పరీక్ష విధానం ► ఏపీసెట్ పరీక్ష ఆఫ్‌లైన్(పెన్ పేపర్) విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ► పేపర్–1లో.. టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూ డ్‌ను అన్ని విభాగాల అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో(బైలింగ్వల్) ఉంటుంది. ► పేపర్–2 పరీక్ష అభ్యర్థి ఏ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో దానిపై ఉంటుంది. ► పేపర్–1: టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్ : ► ఈ పేపర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్‌పై ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇది అందరూ రాయాల్సిన కామన్ పేపర్. మొత్తం 50 ప్రశ్నలు–100 మార్కులకు పేపర్1 పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. తెలుగు/ఇంగ్లిష్‌లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఈ పేపర్‌కు కేటాయించిన సమయం ఒక గంట మాత్రమే. ► పేపర్1లో.. టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టి ట్యూడ్, కాంప్రెహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథ మెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ), పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుయేషన్ సిస్టమ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► పేపర్–2 ఎలక్టివ్ సబ్జెక్ట్: ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు(ఎలక్టివ్)కు సంబంధించిన పేపర్. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు. ఈ పేపర్లో ఎలాంటి నెగెటివ్ మార్కుల విధానం లేదు. ► ఏపీ సెట్లో మొత్తం 30 సబ్జెక్టులు పేర్కొన్నారు. వీటిల్లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులు రెండు భాషల్లో (తెలుగు/ఇంగ్లిష్) ఉంటాయి. మిగతా సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. ► ఏపీ సెట్ సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, చరిత్ర, కెమికల్ సైన్సెస్, కామర్స్,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ అట్మాస్పియరిక్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్న లిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్సె స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్ మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్. ఇలా చదవడం మేలు ► ఏపీసెట్ పరీక్షకు ఇంకా రెండున్నర నెలల సమ యం అందుబాటులో ఉంది. కాబట్టి ఈ విలువైన సమయాన్ని అభ్యర్థులు సమర్థంగా వినియోగించు కోవాలి. ► మొదట రెండు పేపర్ల సిలబస్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ► ముఖ్యంగా అందరికీ కామన్‌గా ఉండే పేపర్–1 ఎంతో కీలకమైంది. ఈ పేపర్ సిలబస్ కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తొలుత పేపర్1పై దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. ఈ పేపర్ సిలబస్‌లో మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. వీటి నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గత ప్రశ్న పత్రాల ద్వారా అంచనాకు రావాలి. ముఖ్యమైన టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ► పేపర్– 2లో.. అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇది అభ్యర్థి పీజీ స్థాయిలో చదివిన సబ్జెక్టు. కాబట్టి ఓ మాదిరి ప్రిపరేషన్ సాగించినా మంచి మార్కులు స్కోరు చేయవచ్చు. అందుకోసం యూజీసీ గతంలో నిర్వహించిన నెట్ ప్రశ్న పత్రాలు, సెట్ గత పేపర్లను పరిశీలించి.. ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► ఏపీసెట్ పరీక్ష తేది: 31.10. 2021 ► పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://apset.net.in/home.aspx -
ఏపీసెట్ కౌన్సెలింగ్ వాయిదా
ఏయూక్యాంపస్ (విశాఖ): రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2020 సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించాల్సిన రెండో దశ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా వేశామన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను అటెస్టేషన్ చేసి మెంబర్ సెక్రటరీ apsetau@gmail.comకు మే 10వ తేదీలోగా పంపాలని సూచించారు. -
రేపట్నుంచి ‘సెట్స్’
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్’ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నేపథ్యంలో అన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేసినందున తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీనుంచి వరుసగా ఏపీసెట్స్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. ఐసెట్తో ఆరంభం... ► టీసీఎస్, ఏపీ ఆన్లైన్ సంయుక్తంగా ఆన్లైన్లో ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ► ఈనెల 10వ తేదీ నుంచి ఐసెట్తో ఏపీ సెట్స్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ► ఐసెట్ 10, 11వ తేదీల్లో, ఈసెట్ 14న, ఎంసెట్ 17 నుంచి 25 వరకు, పీజీసెట్ 28న, ఎడ్‌సెట్, లాసెట్ అక్టోబర్ 1న, పీఈసెట్ అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఉంటాయి. ► సెట్ పరీక్షలకు సెంటర్లతో పాటు స్లాట్స్‌ను కూడా పెంచారు. ఐసొలేషన్ గదులు కూడా.. ► ప్రతి పరీక్ష కేంద్రాన్ని ముందుగానే శానిటైజ్ చేసి సిబ్బందికి కిట్స్ అందిస్తారు. మాస్కులు, గ్లౌజ్‌లు, స్ప్రేయింగ్ మిషన్లు, థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ► ప్రతి సెంటర్లో ఐసొలేషన్ గదులు . టెంపరేచర్ నిర్ణీత పరిమాణం కన్నా ఎక్కువగా ఉన్న వారికి ఆ గదుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ► ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, మానిటరింగ్ డెస్కులు ఏర్పాటు. ► విద్యార్థులకు బార్కోడ్ హాల్ టికెట్లు జారీ చేసి సూచనలు, రోడ్ మ్యాపులను పొందుపరుస్తున్నారు. ► విద్యార్థులకోసం హెల్ప్‌లైన్ డెస్కు, ఫోన్ నంబర్లు అందుబాటులోకి. ► ప్రతి అభ్యర్థి కోవిడ్ 19పై డిక్లరేషన్ సమర్పించాలి.మాస్కులు, గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించాలి. -
20న ఏపీ సెట్..
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 20న ఏపీ సెట్ నిర్వహిస్తున్నామని ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి మీడియాకు వెల్లడించారు. యూజీసీ అనుమతితో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల కోసం ఏపీ సెట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి పదిన్నర గంటల వరుకు, పేపర్-2 ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరుకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం-1లో 50 ప్రశ్నలకు వంద మార్కులు, ప్రశ్నాపత్రం-2లో వంద ప్రశ్నలకు రెండు వందల మార్కులు ఉంటాయని వీసీ చెప్పారు. విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రసాదరెడ్డి తెలిపారు. ఏపీ సెట్‌కు 34,020 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. విశాఖ రీజియన్‌లో అత్యధికంగా 7805 మంది హాజరవుతున్నారన్నారు. పరీక్ష హాలులోకి సెల్ఫోన్లు అనుమతి లేదని.. తీసుకొస్తే కేసులు నమోదు చేస్తామని వీసీ స్పష్టం చేశారు. -
20న ఏపీసెట్ కీ విడుదల
ఏయూక్యాంపస్ (విశాఖ): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) -2016 ప్రాథమిక కీని ఈనెల 20న ఏపీసెట్ వెబ్సైట్ www.apset.net.in లో ఉంచుతున్నట్లు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక కీ ని ఈనెల 25 వరకూ వెబ్సైట్లో ఉంచుతారు. అభ్యర్థులు పరీక్షలో వచ్చిన ప్రశ్నలపై ఎటువంటి సందేహాలున్నా ఈనెల 25వ తేదీలోగా apsetau@gmail.com మెయిల్ ఐడీకి పూర్తి వివరాలు పంపాలి. విద్యార్థులు తమ పరీక్ష హాల్‌టికెట్, ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానాన్ని తెలుపుతూ సంబంధిత ఆధారాలను ఈమెయిల్‌కు జతపరచాలి. 25వ తేదీ సాయంత్రం 5 గంటల తరువాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించరు. -
ఏపీ సెట్ నిర్వహణ బాధ్యత ఏయూకే..
ఏయూ క్యాంపస్ (విశాఖ) : ఏపీ సెట్ నిర్వహణ బాధ్యతను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించింది. గురువారం ఏయూలోని సెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏయూ ఇన్చార్జి వీసీ ఈఏ నారాయణ ఈ వివరాలు వెల్లడించారు. త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ తేదీలు, షెడ్యూలు విడుదల చేస్తామన్నారు. నెల రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, జూలై నెలాఖరులో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. యూజీసీ గత నెలలో ఏయూను సందర్శించి, వనరులు, మేథో, మౌలిక వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి మూడేళ్ల కాలానికి సెట్ నిర్వహణ బాధ్యతను మంజూరు చేసిందన్నారు. సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 31 అంశాలలో సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. డిగ్రీ కళాశాలల అధ్యాపక ఉద్యోగాలు, యూనివర్సిటీల ఆచార్యుల నియామకాల్లో సెట్ అర్హతను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలమందికిపైగా విద్యార్థులు సెట్‌కు దరఖాస్తు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సెట్ అర్హత సాధించినవారికి నేరుగా విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ ప్రవేశం లభిస్తుందన్నారు. సమావేశంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి.రామన్, జి.ఎం.జె.రాజు, ఆచార్య పి.శ్రీనివాస్, పి.హృశికేశవరావు, పి.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఏపీసెట్-13 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రాసేందుకు సహాయకులు అవసరమైన వికలాంగ, అంధ అభ్యర్థులు తమ వివరాలను వారం రోజులు ముందుగా తెలియజేస్తే స్క్రైబ్స్‌ను ఏర్పాటు చేస్తామని ఏపీసెట్ కార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మూడు విభాగాలుగా జరిగే పరీక్షకు 1,26,785 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, తెలుగు, ఫిజిక్స్ తదితర సబ్జెక్టులకు అభ్యర్థులు ఎక్కువగా ఉంటే.. జాగ్రఫీలో అతి కొద్ది మంది మాత్రమే పరీక్ష రాయబోతున్నారు. సజావుగా పరీక్షరాసేందుకు అభ్యర్థులకు రాజేశ్వర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ‘మూడు విభాగాలుగా జరిగే పరీక్షలో మొదటి పేపర్లో 60 ప్రశ్నలకు 50 రాయాలి. కాబట్టి అభ్యర్థులు కేవలం 50 ప్రశ్నలకు మాత్రమే జవాబులివ్వాలి. ఇప్పటికీ హాల్ టికెట్లు అందని, స్క్రైబ్స్ అవసరమైన అభ్యర్థులు తమ వివరాలను 040 27097733 నంబరుకు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. apset2012 @gmail.com ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు’ అని సూచించారు.