జలీల్ ఖాన్‌ను తలదన్నే ఫీట్‌! | Andhra University Officials Mistake in Graduated | Sakshi
Sakshi News home page

జలీల్ ఖాన్‌ను తలదన్నే ఫీట్‌!

Published Sun, Jun 24 2018 12:12 PM | Last Updated on Sun, Jun 24 2018 1:52 PM

Andhra University Officials Mistake in Graduated - Sakshi

బీకామ్‌లో ఫిజిక్స్‌ ఉంటుందని ఆ మధ్య ఉవాచించిన ఒక ప్రజాప్రతినిధి ‘అపార’ పరిజ్ఞానంపై ప్రసార,సామాజిక మాధ్యమాల్లో కొన్నాళ్లపాటు ఏకధాటిగా సెటైర్లే.. సెటైర్లు..

కానీ.. ఆయనగారి కంటే ముందు ఒక విద్యాసంస్థ ఆయన్ను తలదన్నే ఫీట్‌ ప్రదర్శించింది. సదరు ప్రజాప్రతినిధి ఒక్క సబ్జెక్టు విషయంలోనే తన అతి తెలివి ప్రదర్శిస్తే.. ఈ విద్యాసంస్థ మాత్రం ‘కుడి ఎడమైతే పొరపాటు లేదని..’ అనుకుందో ఏమో.. ఏకంగా బీఎస్సీ విద్యార్థికి బీకామ్‌ పట్టా ఇచ్చేసింది. అలా ఇచ్చిన సంస్థ ఊరూ పేరు లేనిదా.. అంటే.. ఎంతో విశిష్టత, ఉన్నత చరిత్ర కలిగిన మన ఆంధ్ర విశ్వవిద్యాలయమే ఆ ఘనతను సొంతం చేసుకుంది..

పోనీ.. ఏదో పొరపాటు జరిగిపోయింది.. దాన్ని వెంటనే సరిదిద్దారా అంటే.. పట్టా మార్చకుండా మూడేళ్లుగా బాధిత విద్యార్థిని ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఏయూ అధికారుల నిర్వాకంతో ఉద్యోగావకాశాలు కూడా పోగొట్టుకుంటున్న ఆ కుర్రాడు చివరికి ‘సాక్షి’ని ఆశ్రయించాడు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం.. చెప్పుకోవడానికి దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం.. కానీ తీరులో అంతా గందరగోళం అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి ఉదంతం. ఆ జి ల్లాలోని నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన శ్రీహరి టెక్కలి బీఎస్‌ అండ్‌ జేఆర్‌ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్‌ కోర్సు చేశాడు.  2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్‌ ఇన్‌ కామర్స్‌ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రది స్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆం ధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించా లని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా..  ఏముంది మార్చేద్దాం లే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అది గో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. 

ఉద్యోగావకాశమూ పోయె..
సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్‌ సర్టిఫికెట్‌ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్‌.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్‌ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్‌ సర్టిఫికెట్‌తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే  కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు.

అలా ఎలా జరిగిందో?
వాస్తవానికి వర్సిటీలో బీఎస్సీ, బీకామ్‌లకు విడివిడిగా విభాగాలున్నాయి. ఒక విభాగానికి సం బంధించిన సర్టిఫికెట్‌ మరో విభాగంలో కలిసే అవకాశం లేదు. క్లర్క్, సూపరింటెండెంట్‌ పరిశీలించిన తర్వాతే కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సంతకం పెడతారు. ఒకవేళ ముద్రణ సమయంలో పొరపాటు జరిగినా సంబంధిత శాఖ ఉద్యోగులు గమనించాలి. కనీసం తప్పిదం జరిగిన తర్వాతైనా సరిదిద్దకుండా ఏయూ అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలపాలవుతోంది.

నా వద్దకు వస్తే వెంటనే మార్పిస్తా
ఎలా జరిగిందో తెలియదు.. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది.. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మాదే.. ఆ యువకుడు నేరుగానన్ను కలిస్తే సర్టిఫికెట్‌ మార్పించి ఇస్తాను.   
    – సుధాకర్‌రెడ్డి,
కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement