- పక్కదారి పడుతున్న అంగన్‌వాడీ బియ్యం
- రెచ్చిపోతున్న కాంట్రాక్టర్లు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
- పిల్లలు, గర్భిణులకు అందే పౌష్టికాహారంలో భారీ కోత
సాక్షి ప్రతినిధి, తిరుపతి:
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులు పక్కదారి పడుతున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు సరఫరా చేసే బియ్యంలో భారీగా నొక్కేస్తున్నారు. 50 కిలోల బస్తాకు సరాసరి 38 కిలోల నుంచి 40 కిలోలు మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్నాయని కొంత మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అవినీతిలో ముఖ్యంగా రెవెన్యూ, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే కందిపప్పు, నూనెలో సైతం అంగన్‌వాడీ కేంద్రాలకు చేరేసరికి పరిమాణం తగ్గిపోతున్నట్లు సమాచారం. దీంతో అంగవాడీ కార్యకర్తలు ఏమీ చేయలేక పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారంలో కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడంతోనే ప్రభుత్వం నిర్థేశించిన పరిమాణంలో పౌష్టికాహారం అందటం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.
సరుకుల్లో కోత
అంగన్‌వాడీలకు సరఫరా అయ్యే బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ, నూనెను ఏపీ ఆయిల్‌ఫెడ్, కందిపప్పును ట్రేడర్స్, కోడిగుడ్లు, పాలను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. కాగా కాంట్రాక్టర్లతో ఆయా ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కు కావడంతో సరుకుల సరఫరాలో తేడాలున్న పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బియ్యం సరఫరాలోనే భారీగా తూకాల్లో తేడా వస్తున్నట్లు అంగవాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు, నూనె సరఫరాలో సైతం అధికారులతో కుమ్మకై కొన్నిచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పర్సెంటేజీల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి అధికారులు దండుకుంటున్నట్లు కింది స్ధాయి సిబ్బందిలో సైతం చర్చ సాగుతోంది. మొత్తం మీద అంగన్‌వాడీ కేంద్రాలకే సరుకులు తక్కువ పరిమాణంలో చేరటంలో, కింది స్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించడంలో విఫలమవుతున్నారు. మధ్యాహ్నాం బాలింతలు, గర్భిణులకు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనెతో అన్నం, ఆకుకూర పప్పు రోజువారీ వడ్డించాలి. 200 గ్రాముల పాలు, వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. పిల్లలకు 75 గ్రాముల బియ్యం, 16 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనెతో వంట చేసి వడ్డించాలి. సరుకుల్లో కోతతో వీటిని తక్కువ పరిమాణంలో అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చిన్న గొట్టిగల్లు మండలంలో అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశమైన ఆర్‌డీడీ శారద, పీడీ విజయలక్ష్మి సమక్షంలోనే సరుకుల్లో తగ్గుదలపై కొంత మంది కార్యకర్తలు నిలదీసినట్లు సమాచారం. ఆ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.