తహశీల్ ఆఫీస్ ఎదుట అంగన్‌వాడీల ధర్నా
తహశీల్ ఆఫీస్ ఎదుట అంగన్‌వాడీల ధర్నా
బోధన్ రూరల్, :
పట్టణంలోని తహశీల్ కార్యాలయం ఎదుట మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు.
తహశీల్ కార్యాలయంలోకి సిబ్బంది వీధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తహశీల్దార్ సీహెచ్. శ్రీకాంత్‌ను కార్యాలయంలోకి రాకుండా కార్యకర్తలు అడ్డుకుని నినాదాలు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయంలో కూర్చుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు శంకర్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలన్నారు. నేడు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చాలిచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల నుంచి వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా స్పందించి అంగన్‌వాడీల డిమాండ్‌లు వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే
రెంజల్ : తమ సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు ఆందోళన బాట పట్టారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారు మంగళవారం తహశీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పలు గ్రామాల కార్యకర్తలు ముందుగా తహశీల్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. దీనికి సీఐటీయూ బోధన్ డివిజన్ నాయకుడు ఏశాల గంగాధర్ ఆధ్వర్యంలో ఉదయం కొద్ది సేపు కార్యాలయంలోనికి అధికారులు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో సిబ్బంది బయటే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల అంగన్‌వాడీల సంఘం అధ్యక్షురాలు సురేఖ, నాయకులు పద్మావతి, భాగ్యలక్ష్మి, బాలహంస, రాధిక పాల్గొన్నారు.